ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్(Israel) ఆర్థికంగా తీవ్ర భారం మోయాల్సి వస్తోంది. ఇరాన్(Iran) ప్రయోగిస్తున్న క్షిపణుల నుంచి తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు ఇజ్రాయెల్ రాత్రికి రాత్రే భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణకే ప్రతి రాత్రి సుమారు 285 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 2,400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనాలను ఉటంకిస్తూ అమెరికా(America) అధికారులు ఈ వివరాలను వెల్లడించినట్లు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ తెలిపింది.

‘ఆపరేషన్ రైజింగ్ లయన్’
గతవారం ఇరాన్ అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగింది. ఇప్పటివరకు సుమారు 400 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు టెహ్రాన్ ప్రకటించింది.
ఈ క్షిపణులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ తన ‘యారో సిస్టమ్’, ‘డేవిడ్స్ స్లింగ్’ వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో పాటు అమెరికా సరఫరా చేసిన ‘పాట్రియాట్స్’, ‘థాడ్’ బ్యాటరీలను కూడా మోహరించింది. అయినప్పటికీ, ఇరాన్ క్షిపణులు కొన్ని కీలక ప్రాంతాలపై పడుతుండటంతో ఇజ్రాయెల్ తీవ్రంగా శ్రమిస్తోంది.
ఇజ్రాయెల్ ఆర్థిక దినపత్రిక అంచనా ప్రకారం
ఈ రక్షణ వ్యవస్థల నిర్వహణ ఖర్చు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు పెను భారంగా మారింది. ఒక్కో ‘యారో సిస్టమ్’ ఇంటర్‌సెప్టర్ విలువ సుమారు 3 మిలియన్ డాలర్లు ఉంటుందని, వీటిని ప్రయోగించి క్షిపణులను అడ్డుకుంటున్నారని ‘ది మార్కర్’ అనే ఇజ్రాయెల్ ఆర్థిక దినపత్రిక అంచనా వేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ దాదాపు ప్రతిరోజూ క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు ప్రమాదకరస్థాయికి పడిపోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిఘా విభాగానికి సమీపంలోని ప్రాంతాలు దెబ్బతిన్నాయి
అమెరికా నుంచి సకాలంలో ఆయుధ సరఫరా లేదా ఆర్థిక సాయం అందకపోతే, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ 10 నుంచి 12 రోజుల్లోనే బలహీనపడవచ్చని సమాచారం. ఇరాన్ దాడుల వల్ల టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ సైనిక దళాల (ఐడీఎఫ్) ప్రధాన కార్యాలయం, హైఫా సమీపంలోని కీలక చమురు శుద్ధి కర్మాగారం, ఇజ్రాయెల్ నిఘా విభాగానికి సమీపంలోని ప్రాంతాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 24 మంది మరణించారని, మరో 600 మంది గాయపడ్డారని నెతన్యాహు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ సైనిక మౌలిక వసతులను దెబ్బతీసి విజయం సాధించామని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ, ఈ ప్రతిదాడులను అడ్డుకోవడానికి మాత్రం ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇరాన్ గగనతలమంతా తమ నియంత్రణలోనే ఉందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ వద్ద స్కై ట్రాకర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు వద్ద ఉన్నాయని, అయినప్పటికీ వాటిని అమెరికా సాంకేతికతతో పోల్చుకోలేమని ట్రంప్ అన్నారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు ప్రమాదకరస్థాయికి పడిపోయే అవకాశం వుంది.
Read Also: Fordo Nuclear Plant: ఇరాన్‌లో ఫోర్డో అణు కేంద్రంపై ఏరియల్ దాడి