ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం మధ్యప్రదేశ్(Madya Pradesh) లో పర్యటిస్తోన్నారు. దేవి అహల్యాబాయి మహిళా సశక్తీకరణ్ సమ్మేళన్ లో పాల్గొన్నారు. దతియా, సత్నా ఎయిర్ పోర్టులు సహా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భోపాల్(Bhopal) లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తో కలిసి ప్రసగించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ. సింధూరం భారతీయ సంప్రదాయంలో మహిళా శక్తికి చిహ్నమని వ్యాఖ్యానించారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు భారతీయుల రక్తాన్ని కళ్లచూశారని, అక్కడితో ఆగకుండా దేశ సంస్కృతి సంప్రదాయాలపై కూడా దాడి చేశారని అన్నారు.

140 కోట్ల మంది ప్రజలు ప్రజలు ఒక్కటయ్యారు
దేశ మహిళా శక్తికి సవాలు విసిరారని పేర్కొన్నారు. భారత్ కు సవాల్ విసరడం అనేది- ఎంత ప్రమాదకర.. ప్రాణాంతకరమైనదో ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రుదేశానికి తెలియజేశామని మోదీ అన్నారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, వాటి యజమానులకు ముఖం పగలిలా సమాధానం ఇచ్చామని పేర్కొన్నారు. పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని, శత్రుదేశానికి వ్యతిరేకంగా పోరాడాలని దేశం మొత్తం కోరిందని ప్రధాని మోదీ చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా 140 కోట్ల మంది ప్రజలు ప్రజలు ఒక్కటయ్యారని, ఏకతాటిపైకి వచ్చారని ఆయన గుర్తు చేశారు. బుల్లెట్ కు బుల్లెట్ తోనే సమాధానం ఇవ్వాలని ఒక్కసారిగా గర్జించారని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ లో బీఎస్‌ఎఫ్ పెద్ద పాత్ర పోషించిందని మోదీ కితాబిచ్చారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు రెప్పవాల్చకుండా పహారా కాశారని ప్రశంసించారు. సరిహద్దు కాల్పులకు తగిన సమాధానం ఇచ్చారని, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి శత్రువుల పోస్టులను నాశనం చేశారని అన్నారు.
అతిపెద్ద విజయం ఆపరేషన్ సింధూర్
దేశ చరిత్రలో ఉగ్రవాదులపై జరిగిన అతిపెద్ద విజయం ఆపరేషన్ సింధూరేనని వ్యాఖ్యానించారు మోదీ. పాకిస్తాన్ సైన్యం ఎప్పుడూ ఊహించని ప్రాంతాల్లో దేశ సాయుధ దళాలు దాడులు జరిపాయని, ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయని చెప్పారు. ఉగ్రవాదుల సహాయంతో ప్రాక్సీ యుద్ధం అస్సలు ఆమోదయోగ్యం కాదనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్ తెలియజేసిందని అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ భూభాగంలోనే ఆ దేశంపై దాడి చేయడానికీ వెనుకాడబోమని ప్రధాని హెచ్చరించారు. ఉగ్రవాదులకు సహాయం చేసే వారు కూడా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. భారత్ పై కన్నెత్తి చూడటానికి ఉగ్రవాద సంస్థలు భయపడే స్థితికి వచ్చాయని చెప్పారు.
Read Also: Mock Drills: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో నేడు మాక్ డ్రిల్స్