అంతర్జాతీయ ప్రతిభ, సృజనాత్మకతల కోసం ప్రపంచ వేదిక నిర్మాణానికి వేవ్స్ పునాది వేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాణం, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, మ్యూజిక్, కాన్సర్ట్‌లకు భారతదేశం కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వేళ ప్రపంచ ప్రతిభకు ఒక వేదికను అందించే సామర్థ్యం వేవ్స్‌కు ఉంటుందని ప్రధాని తెలిపారు. ముంబయిలో తొలి గ్లోబల్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్- వేవ్స్‌ను మోదీ ప్రారంభించారు. వేవ్స్ సమ్మిట్ ద్వారా క్రియేటర్లు, స్టార్టప్‌లు, పరిశ్రమ నాయకులు, పాలసీ మేకర్లను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.
ఇది సాంస్కృతిక మార్పులకు కేంద్రంగా, వినోద రంగం కోసం గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌గా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచ కేంద్రంగా ఉంచడం వేవ్స్ లక్యం: మోదీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లు, స్టార్టప్‌లు, ఇండస్ట్రీ లీడర్లు, పాలసీ మేకర్లను ఒకచోట చేర్చడం ద్వారా భారత్‌ను మీడియా, వినోదం డిజిటల్ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా ఉంచడం వేవ్స్ లక్ష్యమని మోదీ చెప్పారు. సామాజిక మాధ్యమాలు, ఓటీటీల్లో అసభ్య కంటెంట్‌ను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, సమాజంలో సృజనాత్మకమైన బాధ్యతలు కలిగి ఉండటం ముఖ్యమన్నారు. మనుషులు రోబోల్లా మారకూడదని హితవుపలికిన ప్రధాని, మానవ సమాజ సున్నితత్వాన్ని కాపాడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. మారుతున్న సాంకేతికతతో స్క్రీన్ పరిమాణం మినీగా మారుతున్నప్పటికీ భారతదేశం కథలు మెగాగా మారుతున్నాయని ఆయన అన్నారు.
భారతదేశం వందల కోట్లకు పైగా కథలకు నిలయం
“వంద కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ భారతదేశం, వందల కోట్లకు పైగా కథలకు నిలయం. గత శతాబ్ధకాలంగా ప్రపంచంలోని నలుమూలలా భారతదేశానికి ప్రాచుర్యాన్ని వ్యాప్తి చేయడంలో భారతీయ సినిమా విజయవంతమైంది. రష్యాలో రాజ్‌కపూర్‌కు, సత్యజిత్ రేకు కేన్స్‌లో ఉన్న ప్రజాధరణ ఆస్కార్‌లో ట్రిపుల్ ఆర్ సాధించిన విజయాలే ఇందుకు సాక్ష్యాలు.” వేవ్స్ సమ్మిట్ ద్వారా భారత్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదగడం ప్రారంభమైంది. ఇది స్థానిక ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే వేదికగా మారనుంది.
Read Also: US Ukraine: అమెరికా, ఉక్రెయిన్ ఒప్పందం – ఖనిజాల అగ్రిమెంట్‌కు ఓకే