యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 18 నుండి 24 వరకు ఆయన ఇటలీ మరియు ఇండియాలో పర్యటించనున్నట్లు వైట్ హౌజ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ పర్యటనలో ఆర్థిక సంబంధాలు, భౌగోళిక రాజకీయాలు తదితర కీలక అంశాలపై ఇరు దేశాధినేతలతో జేడీ వాన్స్ చర్చలు జరపనున్నారని పేర్కొంది.
న్యూఢిల్లీ, జైపుర్, ఆగ్రా వంటి ప్రముఖ నగరాల్లో పర్యటన
భారత పర్యటనలో ఆయన న్యూఢిల్లీ, జైపుర్, ఆగ్రా వంటి ప్రముఖ నగరాలను సందర్శించనున్నారు. ఆయా నగరాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అధికారిక సమావేశాల్లో ఆయన కుటుంబంతో కలిసి పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడనుందని అంచనా.
జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన మహిళ
జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన మహిళ కావడం ఈ పర్యటనకు ప్రత్యేకతను తీసుకువస్తోంది. ఆమె భారత సంస్కృతి పట్ల ఉన్న అభిమానం నేపథ్యంలో ఈ పర్యటన వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ పర్యటన ఓ కీలక మైలు రాయిగా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.