JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ , ఆయన సతీమణి ఉషా చిలుకూరి భారత్‌కు విచ్చేశారు. ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో జేడీ వాన్స్, ఉషా దంపతులకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. భారత సాంప్రదాయ నృత్యప్రదర్శన వారిని ఆకట్టుకుంది. నేటి నుంచి 4 రోజులపాటు జేడీ వాన్స్, ఉషా చిలుకూరి దంపతులు, తమ పిల్లలతో కలిసి భారత్ లో పర్యటించనున్నారు. వారి పర్యటనతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు నలుమూలలా భద్రతను పెంచారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ విజయం సాధించాక తొలిసారి భారత పర్యటనకు వచ్చారు.

ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేలా చర్యలు
వారి పర్యటన నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ అంతటా జేడీ వాన్స్ ఫ్యామిలీ ప్రయాణంలో ఎటువంటి సమస్య లేకుండా జరుగుతుందని ఆయన తెలిపారు. ఢిల్లీకి చేరుకున్న కొన్ని గంటలపాటు విశ్రాంతి అనంతరం జేడీ వాన్స్, ఆయన కుటుంబం స్వామినారాయణ అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించుకుంటారు. సంప్రదాయ భారతీయ చేతి వృత్తుల ఉత్పత్తులను విక్రయించే షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా వారు సందర్శించే అవకాశం ఉందని కొందరు అధికారులు పీటీఐకి తెలిపారు.
జైపూర్, ఆగ్రాకు వెళ్లనున్నారని సమాచారం
“అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫ్యామిలీ సోమవారం సాయంత్రం సందర్శించే స్వామినారాయణ అక్షర్ధామ్ ఆలయంలో ముందుగానే అడ్వాన్స్ సెక్యూరిటీ లియాజన్‌ను నిర్వహించాము. ఆలయంతో పాటు చుట్టుపక్కల పూర్తిగా తనిఖీ చేశాం. పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య వారి సందర్శన కొనసాగుతుందని ఓ అధికారి తెలిపారు. జేడీ వాన్స్ సోమవారం రాత్రి ఢిల్లీ నుండి బయలుదేరి జైపూర్, ఆగ్రాకు వెళ్లనున్నారని సమాచారం.
అమెరికా ఉపాధ్యాక్షుడి కుటుంబానికి ప్రధాని మోడీ ఆతిథ్యం
ఇక, జేడీ వాన్స్ కుటుంబం భారత్‌లో వ్యక్తిగత పర్యటనకు వస్తున్నప్పటికీ.. అన్ని ప్రొటోకాల్స్ పాటించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోడీ అమెరికా ఉపాధ్యాక్షుడి కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. అనంతరం వాన్స్, ఉషా చిలుకూరితో ప్రధాని మోదీ పలు అంశాలపై చర్చించనున్నారు. భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసే మార్గాలపై చర్చించనున్నారు. మోడీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.
Read Also : కాల్పుల విరమణ.. దాడులు మాత్రం ఆగడం లేదు : జెలెన్‌స్కీ