అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. అందుకు తగ్గట్టుగానే దేశంలో నిరుద్యోగితకు కారణమవుతున్న వలసదారుల్ని తనిఖీలు, అరెస్టులతో బెంబేలెత్తిస్తున్నారు. సొంత ఖర్చుతో విదేశాలకు పంపేస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా అన్ని అనుమతులతో అమెరికా వీసాలు, గ్రీన్ కార్డులు పొందిన వారిని సైతం తనిఖీలు చేస్తూ గతంలో అక్రమాలకు పాల్పడ్డారేమో గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పుడు వీటన్నింటికీ పరాకాష్టగా అమెరికా వీడకపోతే జరిమానాలు విధించేందుకు సిద్దమవుతున్నారు.

అక్రమ వలసదారులపై ఉక్కుపాదం
అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కార్.. ఈ ప్రక్రియను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా అక్రమ వలసదారులపై తనిఖీలను మరింత ముమ్మరం చేయబోతున్నారు. అంతే కాదు అక్రమ వలసదారులుగా ఓసారి గుర్తించి దేశ బహిష్కరణ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దేశం వీడకపోతే రోజువారీగా జరిమానాలు విధించే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు.
వాషింగ్టన్ -రాయిటర్స్ వార్తా కథనాల ప్రకారం..
వాషింగ్టన్ -రాయిటర్స్ వార్తా కథనాల ప్రకారం వలసదారులను దేశ బహిష్కరణ ఉత్తర్వులు ఇచ్చాక అమెరికాను విడిచి వెళ్లకపోతే రోజుకు 998 డాలర్ల వరకు జరిమానా విధించాలని, వారు చెల్లించకపోతే వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. 1996 నాటి చట్టం ప్రకారం ఈ జరిమానాలు విధించబోతున్నట్లు తెలుస్తోంది.
వలసదారులపై మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జరిమానాలు విధించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. జరిమానాలు చెల్లించని వలసదారుల ఆస్తిని స్వాధీనం చేసుకోవడాన్ని కూడా ట్రంప్ పరిపాలన సిద్దమవుతోందని రాయిటర్స్ తెలిపింది. అమెరికాలో వలసదారులు గతంలో చట్టవిరుద్ధంగా సీబీపీ వన్ అని పిలువబడే మొబైల్ యాప్‌ను వాడారని, ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం దాన్ని సీబీపీ హోమ్‌గా రీబ్రాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
READ ALSO: Donald Trump: చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. 104%కి పెంపు