అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ విద్యాశాఖను రద్దు చేస్తూ ఆయన గురువారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ చర్యతో ఫెడరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ శాశ్వతంగా మూసివేయబడనుంది.
“విద్యను రాష్ట్రాలకు అప్పగించాలి” – ట్రంప్ వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, “విద్యాశాఖ మాకు అవసరం లేదు.. విద్యను పూర్తిగా రాష్ట్రాల నియంత్రణలోకి తరలించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. ఫెడరల్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా రాష్ట్రాలు విద్యను నిర్వహించగలవని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ మూసివేత నిర్ణయంతో అమెరికాలోని పాఠశాలలకు ఫెడరల్ నిధుల సహాయం నిలిచిపోనుంది. ప్రధానంగా తక్కువ ఆదాయం గల పాఠశాలలు, ప్రత్యేక అవసరాల విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితం అవుతారు. ట్రంప్ నిర్ణయంపై డెమొక్రాట్లు, విద్యావేత్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఇది నిరంకుశత్వానికి, అధికారి దుర్వినియోగానికి నిదర్శనం అని వారు ఆరోపించారు. డెమొక్రాట్ సెనేటర్ చక్ షుమెర్ మాట్లాడుతూ, “ఇది ఒక విధ్వంసకరమైన, వినాశకరమైన నిర్ణయం” అని వ్యాఖ్యానించారు.

రిపబ్లికన్ నేతల మద్దతు
ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్, టెక్సాస్ గవర్నర్ గ్రెబ్ అబోట్ తదితర రిపబ్లికన్ నేతలు మద్దతు తెలిపారు. ఈ చర్య ద్వారా అమెరికా డబ్బును ఆదా చేయడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం సాధ్యమవుతుందని ట్రంప్ వాదించారు.
విద్యాశాఖ చిట్టచివరి మంత్రి మెక్‌మహన్
ట్రంప్ ఇటీవల ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ మాజీ సీఈఓ మెక్‌మహన్‌ను విద్యాశాఖ మంత్రిగా నియమించారు. అయితే, ఆమెనే ఆ శాఖకు చివరి మంత్రిగా మార్చడం గమనార్హం.
అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ప్రైమరీ, సెకండరీ విద్యకు కేవలం 13% నిధులు మాత్రమే అందిస్తుంది. మిగతా నిధులను రాష్ట్రాలు, స్థానిక కమ్యూనిటీలు సమకూరుస్తాయి. అయితే, ఫెడరల్ ప్రభుత్వం విద్యార్థుల పౌర హక్కుల రక్షణలో కీలక భూమిక వహిస్తుంది. ట్రంప్ తీసుకున్న విద్యాశాఖ మూసివేత నిర్ణయం అమెరికాలో విద్యావ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది.