USA : అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ వచ్చిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. వరుసపెట్టి పలు దేశాల అక్రమ వలసదారులను పంపించేశారు. స్వయంగా తమ యుద్ధ విమానాల్లోనే వలసదారులను వారి దేశాల్లో వదిలి వచ్చింది. ఇండియాకు కూడా ఇలా మూడు విమానాలు అక్రమ వలసదారులను మోసుకొచ్చాయి. అయితే అమెరికా లో ఇంకా పూర్తిగా అక్రమ వలసదారులు ఏరివేత పూర్తవ్వలేదు. ఈ మధ్య కాలంలో యుద్ధ విమానాలకు బాగా ఖర్చు అవుతుండడంతో ఈ ప్రక్రియను ఆఫారు. ఇప్పుడు దానికి సంబంధించే కొత్త యాప్ ను తీసుకొచ్చామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

సీబీపీ అనే యాప్
అక్రమ వలసదారుల కోసం సీబీపీ అనే యాప్ ను తీసుకొచ్చామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ యాప్ ను ఉపయోగించి వలసదారులు స్వచ్ఛందంగా ఎవరి దేశానికి వారు వెళ్ళవచ్చని చెప్పారు. అలా వెళ్ళడం ద్వారా తరువాతి కాలంలో లీగల్ గా అమెరికాకు వచ్చే అవకాశం ఉంటుందని ట్రంప్ చెప్పారు. అలా కాకుండా అమెరికాలో అక్రమంగా ఉంటూ ప్రభుత్వానికి పట్టుబడితే వారిని తామే బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఒకసారి బహిష్కరణకు గురైతే మళ్ళీ అమెరికాలో కాలు పెట్టడానికి వీలు ఉండదని చెప్పారు.
అక్రమవలసలు గణనీయంగా తగ్గాయి
మరోవైపు తాను రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమవలసలు గణనీయంగా తగ్గాయని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. తాను విధించిన కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలతో ఫిబ్రవరిలో అక్రమ వలసల సంఖ్య చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరాయని ఆయన చెప్పారు. ఇంతటితో అమెరికాపై అక్రమ వలసదారుల దండయాత్ర ముగిసిందని ట్రూత్ సోసల్ మీడియాలో ప్రకటించారు. ఫిబ్రవరిలో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డారని ట్రంప్ చెప్పారు. బైడెన్ ప్రభుత్వంలో ప్రతీనెలా దేశంలోకి మూడు లక్షల మంది అక్రమంగా ప్రవేశించే వారని లెక్కలు చెప్పారు.