1971 నాటి బంగ్లాదేశ్(Bangladesh) విముక్తి పోరాటానికి సంబంధించి యుద్ధ నేరాల కేసులో మరణశిక్ష ఎదుర్కొంటోన్న జమాతే ఇస్లామీ పార్టీ(Jamath Islamii Party) సీనియర్ నాయకుడు ఏటీఎం అజహర్ ఉల్ (Hajahar Ull) ఇస్లాంను ఆ దేశ సుప్రీం కోర్టు(Supreme court) మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ రఫాత్ అహ్మాద్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల కూడిన సుప్రీం కోర్టు అప్పీల్ విభాగం ఈ తీర్పును వెలువరించింది. ‘ఏటీఎం అజహర్ ఉల్ ఇస్లాంను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.. ఆయనపై ఇతర కేసులు లేనట్లయితే వెంటనే విడుదల చేయాలని జైలు అధికారులకు ఆదేశించింది’ అని బంగ్లాదేశ్ ప్రభుత్వ తరపున న్యాయవాది తెలిపారు.
ఇస్లామిక్ పార్టీకి చెందిన 73 ఏళ్ల అజహర్ ఉల్
ఈ తీర్పును మార్చే ఎలాంటి అంతిమ న్యాయ స్థానం బంగ్లాదేశ్‌లో లేదని, అంతర్జాతీయ వేదికలకూ ఇది వర్తించదని ఆయన చెప్పారు. షేక్ హసీనా పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో గతేడాది నుంచి అస్థిరత కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.గతంలో ఆధారాలను పరిశీలించకుండా మరణశిక్ష విధించారని, దీనిని అన్యాయమైన తీర్పుగా అత్యున్నత న్యాయస్థానం అభివర్ణించినట్టు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించిన ఇస్లామిక్ పార్టీకి చెందిన 73 ఏళ్ల అజహర్ ఉల్ ఇస్లాం.. మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయనపై నిర్దాక్షిణ్యంగా నరహత్యలు, బలాత్కారాలు, ఊచకోత వంటి నేరాలను మోపారు.

ప్రభుత్వ సారథిగా కొనసాగుతున్న యూనస్
బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును 2019 అక్టోబర్ 23న అప్పీల్ డివిజన్ మళ్లీ సమీక్షించిన తర్వాత, అజహర్ ఉల్ ఇస్లాం 2020 జూలై 19న రివ్యూ పిటిషన్ వేశారు. ఇందుకు 14 న్యాయ ఆధారాలను సమర్పించారు. ఈ తీర్పును బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చట్ట సలహదారుగా ఉన్న ప్రొఫెసర్ అసిఫ్ నజ్రాల్ స్వాగతించారు.
DUలోని వామపక్ష విద్యార్థులు ర్యాలీలు
అయితే ఈ తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే, ఢాకా విశ్వవిద్యాలయం (DU), రాజశాహి విశ్వవిద్యాలయం (RU) లలో ప్రత్యర్థి విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు ప్రారంభించాయి. DUలోని వామపక్ష విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి తీర్పును ఖండించారు. బాంగ్లాదేశ్ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి షిముల్ కుమ్భకర్ మాట్లాడుతూ.. ‘రజాకార్లు, అల్-బద్ర్ సభ్యులను విడుదల చేస్తూ వారి నేరాలను పూర్తిగా మాఫీ చేస్తున్న తాత్కాలిక ప్రభుత్వానికి ఫాసిస్ట్ హసీనా సర్కారుకు పట్టినగతే పడుతుంది’ అని హెచ్చరించారు.
మూడు మరణశిక్షలతో నిందితుడిని నిర్దోషిగా బయటికి
రివల్యూషనరీ స్టూడెంట్ యూనిటీ ప్రధాన కార్యదర్శి జబీర్ అహ్మద్ జుబైల్ .. మూడు మరణశిక్షలతో నిందితుడిగా ఉన్న ఒకరిని ఇప్పుడు పూర్తిగా నిర్దోషిగా ప్రకటించడం చూశామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజశాహి యూనివర్సిటీలో వామపక్ష విద్యార్థుల టార్చ్ మార్చ్‌ను ఇస్లామిక్ ఛాత్ర శిబిర్ (జమాతేకు చెందిన విద్యార్థి విభాగం) కార్యకర్తలు అడ్డుకున్నారు. వామపక్ష డెమొక్రాటిక్ స్టూడెంట్ అలయన్స్ ప్రకారం.. ఈ దాడిలో డజనుకు పైగా కార్యకర్తలు గాయపడ్డారు.
ఇతర ఐదుగురు నేతలు ఉరి శిక్ష
అజహర్ ఉల్ ఇస్లాం న్యాయవాది శిశిర్ మొనీర్ మాట్లాడుతూ.. ‘ఇతర ఐదుగురు నేతలు ఉరి శిక్షకు గురయ్యారు. కానీ ఆయన ప్రాణాలతో ఉండటం వల్ల నిజమైన న్యాయం దక్కింది’ అని పేర్కొన్నారు. 1971 యుద్ధానికి జమాత్-ఎ-ఇస్లామీ మద్దతు ఇచ్చిన విధానం గురించి ఇప్పటివరకు ఆ పార్టీ విమర్శించలేదు. కానీ మంగళవారం ఆ పార్టీ ప్రస్తుత చీఫ్ షఫీఖుర్ రెహ్మాన్, ఆశ్చర్యకరంగా ఒక క్షమాపణను ప్రకటించారు. ధాకాలో విలేకరుల సమావేశంలో రెహ్మాన్ మాట్లాడుతూ ‘మనం కూడా మానవులమే. తప్పులు జరగొచ్చు. మా పార్టీకి చెందిన ఎవరైనా, లేదా పార్టీ ద్వారా ఎవరైనా బాధితులయ్యారు అనుకుంటే, మేము వారిని హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి’ అని అన్నారు.
Read Also: India Attack: పాక్ మురీద్ బేస్‌పై భారత్ హఠాత్ దాడి