ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ) రంగంలో చాట్‌జీపీటీ వంటి నూతన ఆవిష్కరణల రాకతో టెక్ దిగ్గజం గూగుల్ వెనుకబడిందంటూ వచ్చిన తీవ్ర విమర్శలు, తన రాజీనామాకు సైతం డిమాండ్లు తలెత్తాయన్న వార్తలపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) స్పందించారు. గూగుల్ అంతర్గత ఏఐ ప్రగతిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, అనవసరపు ఆర్భాటాలను పట్టించుకోకుండా లక్ష్యంపైనే దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు. తన బాధ్యతను ఓ ఫుట్‌బాల్ కోచ్‌తో పోల్చుకుంటూ, ఒత్తిడిని తాను ఎలా అధిగమిస్తారో వివరించారు.ఇటీవల లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ఒకానొక దశలో “గూగుల్ కచ్చితంగా ఏఐ రేసులో ఓడిపోతోంది.సుందర్ పిచాయ్ తన మ్యాజిక్ టచ్ కోల్పోయారు వంటి వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారమయ్యాయని, తాను పదవి నుంచి తప్పుకోవాలంటూ కథనాలు కూడా వచ్చాయని పిచాయ్ గుర్తుచేసుకున్నారు.
అత్యున్నత స్థాయి
ఒక సీఈఓగా నేను తీసుకున్న ప్రధాన నిర్ణయం, కంపెనీని ‘ఏఐ-ఫస్ట్’ దిశగా నడిపించడమే. బాధ్యతాయుతమైన ఏజీఐ (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్) అభివృద్ధి చేసి, ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యం, అని ఆయన ఉద్ఘాటించారు.క్లిష్ట సమయాల్లోనూ, సంస్థ అంతర్గతంగా మేం ఏం నిర్మిస్తున్నామో నాకు బాగా తెలుసు. బ్రెయిన్, డీప్‌మైండ్ (DeepMind) వంటి అత్యున్నత స్థాయి పరిశోధనా బృందాలను ఏకం చేసి, ‘గూగుల్ డీప్‌మైండ్’ను ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాలు అప్పటికే తీసుకున్నాను,” అని సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ వ్యూహాత్మక చర్యల ద్వారా ఏఐ రంగంలో గూగుల్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోందని ఆయన పరోక్షంగా సూచించారు.

ప్రతికూల ఫలితాలు
ఇంకా, సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, “నేను అనవసరపు సందడిని (నాయిస్) పట్టించుకోను, ముఖ్యమైన సంకేతాలపైనే (సిగ్నల్) దృష్టి పెడతాను. గూగుల్ (Google) ను నడపడం అంటే బార్సిలోనా లేదా రియల్ మాడ్రిడ్ వంటి పెద్ద జట్లకు కోచింగ్ ఇవ్వడం లాంటిది. ఫుట్ బాల్ సీజన్లలో కొన్నిసార్లు కలిసిరాకపోవచ్చు,అలాగే, టెక్ ప్రపంచంలో కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు రావచ్చు” అని ఆయన వ్యాఖ్యానించారు. జెమినీ వంటి అధునాతన మోడళ్ల అభివృద్ధికి అవసరమైన కంప్యూటింగ్ శక్తిని సమకూర్చడం వంటి అంతర్గత ప్రయత్నాలు బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియకపోవచ్చని, తాము మాత్రం నిర్దేశిత లక్ష్యాల దిశగా స్థిరంగా పయనిస్తున్నామని పిచాయ్ స్పష్టం చేశారు.
Read Also: Mahatma Gandhi: గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష