జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తరువాత.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది. త్రివిధ దళాలు పూర్తిగా యాక్టివేట్ అయ్యాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తూ వస్తోన్నారు.

సభ్య దేశాలు అడిగిన పలు ప్రశ్నలకు పాకిస్తాన్ నో ఆన్సర్
ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్‌కు మరోసారి చుక్కెదురైంది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో బోల్తా పడింది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి తామే కారణం అంటూ భారత్ చెబుతోండటాన్ని తప్పు పడుతూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది పాకిస్తాన్. ఆ దేశం కోరిక మేరకు ఐరాస భద్రత మండలి ప్రత్యేకంగా సమావేశమైంది. భారత కాలమానం ప్రకారం- అర్ధరాత్రి దాటిన తరువాత 12:30 నిమిషాలకు న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటైంది. భద్రత మండలి సభ్యదేశాలన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయి. పాకిస్తాన్ ప్రతిపాదించిన అంశాలు చర్చకు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న నిర్ణయాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రత్యేకించి- ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడం, ఇండస్ వాటర్ ట్రీటీ అంశం వంటివి ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా సభ్య దేశాలు అడిగిన పలు ప్రశ్నలకు పాకిస్తాన్ వద్ద సమాధానం లేకుండా పోయింది.
మతం అడిగి మరీ పర్యాటకులను కాల్చిచంపడంపై అభ్యంతరం
పాకిస్తాన్ వైఖరి పట్ల భద్రత మండలి సభ్య దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ తీర్మానించాయి. పాకిస్తాన్ ప్రతిపాదనలనేవీ కూడా అంగీకరించడానికి నిరాకరించాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో లష్కరే తొయిబా ప్రమేయం ఉండే అవకాశం ఉందా అంటూ అడిగిన ప్రశ్నకు పాకిస్తాన్ ఇవ్వలేకపోయిందని సమాచారం. భద్రత మండలి పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. ఉగ్రవాద విషయంలో పాకిస్తాన్ జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించాయి. పహల్గామ్‌లో మతం అడిగి మరీ పర్యాటకులను కాల్చిచంపడాన్ని కొంతమంది సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారడం చర్చనీయాంశమైంది. అలాగే- పాకిస్తాన్ క్షిపణి పరీక్షలను చేపట్టడం, అణ్వస్త్రాలను ప్రయోగిస్తామంటూ హెచ్చరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది భద్రత మండలి ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌తో ద్వైపాక్షికంగా సమస్యలను శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.
Read Also: India- Pak War : భారత్ – పాక్ ఉద్రికత్తలు మధ్య ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన