భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పరిస్థితులు దిగజారుతున్న వేళ.. అలర్ట్ అయ్యాయి. పలు రాష్ట్రాల్లో స్కూళ్లు,(Schools) కాలేజీలు(Collages) మూతపడ్డాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు లీవులను రద్దు చేశారు. మరికొన్ని ఎయిర్‌పోర్టులను మూసివేయడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ వంటి పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన మెరుపు దాడులతో పాకిస్తాన్ వణికిపోయింది. ఆ తర్వాత సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘించి విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోంది. సైనికులు, సరిహద్దు గ్రామాల ప్రజలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు దిగుతోంది. మరోవైపు.. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి సరిహద్దు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని.. డ్రోన్లు, వైమానిక దాడులకు పాల్పడుతుండగా.. భారత డిఫెన్స్ వ్యవస్థ వాటిని అడ్డుకుంటోంది. మరోవైపు.. పాక్‌కు చెందిన పలు యుద్ధ విమానాలను కూడా భారత సైన్యం నేలకూల్చింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
హై అలర్ట్
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ సహా సరిహద్దు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగుల సెలవులు రద్దు చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. పాక్‌తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లలో స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. చండీగఢ్, శ్రీనగర్, అమృత్‌సర్ సహా మొత్తం 27 ఎయిర్‌పోర్టులు మూతపడటంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఢిల్లీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను సర్కార్ రద్దు చేసింది. నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మాల్స్, మార్కెట్లు, మెట్రో స్టేషన్లు, హోటళ్లు, రవాణా కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈస్ట్ ఢిల్లీ డీసీపీ అభిషేక్ ధనియా మాట్లాడుతూ.. మయూర్ విహార్ ఫేజ్-1 మెట్రో స్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించామని, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఆ మెట్రో స్టేషన్‌లో 41 సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేస్తున్నాయని.. ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు మహిళా సిబ్బందితో సహా 9 మంది సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుళ్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
Read Also :PM Modi : ఆపరేషన్ సింధూర్’ – ప్రధాని మోదీ పెట్టిన పేరే