పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంబడి మరోసారి కాల్పుల కలకలం కొనసాగుతోంది. పాకిస్థాన్ సైన్యం వరుసగా ఏడో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి మూడు సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లలో భారత సైన్యం పైకి కాల్పులు జరిపింది. దీనిని భారత్ సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.
వేగంగా స్పందిస్తున్న భారత సైన్యం
ఏప్రిల్ 30-మే1 అర్ధరాత్రి జమ్ముకశ్మీర్‌లోని మూడు సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లలో పాకిస్థాన్ కాల్పులు జరిపింది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ ఎదురుగా ఉన్న పాకిస్థాన్ ఆర్మీ పోస్టుల నుంచి కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. వీటికి భారత్ ఆర్మీ దళాలు వేగంగా స్పందించాయని ఓ అధికారి పేర్కొన్నారు. అటూ బారాముల్లా, పూంచ్ జిల్లాల్లోనూ కవ్వింపు చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి వరుసగా ప్రతిరోజూ పాక్ సైన్యం భారత దళాలపై ఎల్ఓసీ వెంబడి కాల్పులు జరుపుతున్నాయి. దీటుగా భారత్ ఆర్మీ బదులిస్తోంది.

పాక్‌కు భారత్ హెచ్చరిక
ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల సైనికాధికారులు బుధవారం హాట్‌లైన్ ద్వారా మాట్లాడినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. నియంత్రరేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి కాల్పులు జరపడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపిందని చెప్పాయి. ఇకపై ఎలాంటి కవ్వింపుల లేకుండా ఉల్లంఘనలకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరికలు జారీ చేసిందని పేర్కొన్నాయి.
అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం, పాక్ పౌరులు భారత్‌ను విడిచి వెళ్లాలని గడువు విధించడం వంటి చేసింది. ఈ చర్యలతో పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేసింది.
Read Also: In-Pak War: ముందే మొదలైన భారత్-పాక్ వార్ ? ఎక్కడంటే..!