పాకిస్తాన్(Pakistan) ఉగ్రదాడి, అనంతరం అక్కడి ఉగ్రస్థావరాలపై భారత్(India) చేపట్టిన మిస్సైల్ దాడులు, పాక్ కవ్వింపు చర్యలకు బదులుగా అక్కడి రక్షణ స్థావరాలపై చేసిన దాడులతో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది. మన సత్తా గురించి ఇక్కడున్న వివిధ పార్టీల రాజకీయ నాయకులకు నమ్మకం ఉన్నా లేకున్నా.. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్(Shebaz Sharif) అజర్‌బైజాన్(Azerbaijan)లో భారత్ గురించి మాట్లాడటం ద్వారా మన సత్తాను ప్రపంచానికి చాటారు. తమ కంటే 5 రెట్లు ఎక్కువ జనాభా కలిగిన భారత్.. ఆర్థికంగా అనేక రెట్లు ముందంజలో ఉందని, దశాబ్దాలుగా అధునాత ఆయుధాలను సమకూర్చుకుంటూ వచ్చి తాము మేల్కొనేలోపే బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపుదాడులకు పాల్పడిందని స్వయానా పాక్ ప్రధాని అంతర్జాతీయ వేదికపై చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌కు జరిగిన నష్టం గురించి భారత్ ప్రకటించినదానికంటే చాలా ఎక్కువేనని పాకిస్తాన్ అంతర్గత నివేదిక ఒకటి పేర్కొంది. మొత్తంగా భారతదేశ సత్తా గురించి పొరుగున ఉన్న పాకిస్తాన్ డప్పుకొట్టి మరీ ప్రపంచానికి చాటుతోంది.

సూటిగా.. ఏమాత్రం గురితప్పకుండా నిర్దేశించిన లక్ష్యాలను చేధించిన భారత క్షిపణులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. భారత్ సరిగ్గా ఇదే సమయంలో తమ ఆయుధాలను మరింత శక్తివంతం చేసే ప్రయత్నాలను ప్రారంభించింది. ఆ క్రమంలో పాక్ ప్రధాని స్వయంగా ప్రచారం చేసిన బ్రహ్మోస్ క్షిపణులను మరింత ఆధునీకరించి, సామర్థ్యాన్ని పెంచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
మిషన్ బ్రహ్మోస్-2
భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) స్వదేశీ స్క్రామ్‌జెట్ ఇంజన్ సాంకేతికతలో సాధించిన ప్రధాన విజయం తర్వాత, భారత్ తన తదుపరి తరం హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ అయిన బ్రహ్మోస్-II అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఈ మిస్సైల్ గంటకు మాక్ 8 (ధ్వని వేగం కంటే ఎనిమిది రెట్లు) వేగంతో ప్రయాణించగలదని, 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ పురోగతితో భారత్, అమెరికా, రష్యా, చైనా వంటి హైపర్‌సోనిక్ సాంకేతికతలో అగ్రగామి దేశాల సరసన చేరనుంది.
స్వదేశీ సాంకేతికతలో డిఆర్‌డిఓ విజయం
ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో డిఆర్‌డిఓ 1,000 సెకన్లకు పైగా స్క్రామ్‌జెట్ ఇంజన్ కంబస్టర్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఇది హైపర్‌సోనిక్ మిస్సైల్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విజయం భారత్‌ను స్వదేశీ హైపర్‌సోనిక్ సాంకేతికతలో స్వావలంబన వైపు నడిపిస్తుంది. రష్యా సాంకేతికతపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ పురోగతి ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఇది దేశీయ రక్షణ పరిశ్రమను అనేక రెట్లు బలోపేతం చేస్తుంది.
భారత్-రష్యా సహకారం
1998లో భారత్-రష్యా సంయుక్తంగా నెలకొల్పిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ, బ్రహ్మోస్ మిస్సైల్‌ను అభివృద్ధి చేసింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌గా గుర్తింపు పొందింది. ఈ మిస్సైల్ మాక్ 3.5 వేగంతో 290 నుండి 800 కి.మీ. రేంజ్‌లో లక్ష్యాలను ఛేదిస్తుంది. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనలో ఇప్పటికే విస్తృతంగా ఉపయోగంలో ఉన్న ఈ మిస్సైల్, ఇటీవలి ఆపరేషన్ సిందూర్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
బ్రహ్మోస్-II అభివృద్ధికి మార్గం
బ్రహ్మోస్-II ప్రాజెక్ట్ మొదట 2008లో ప్రకటించినప్పటికీ, రష్యా హైపర్‌సోనిక్ సాంకేతికతను పంచుకోవడానికి సంకోచించడం, మిస్సైల్ అధిక ధర వంటి కారణాలతో ఆలస్యమైంది. అంతేకాక, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ (MTCR) నిబంధనలు రష్యాను 300 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ఉన్న మిస్సైళ్ల సాంకేతికతను ఇతర దేశాలకు బదిలీ చేయకుండా అడ్డుకున్నాయి. 2014లో భారత్ MTCR సభ్యత్వం పొందిన తర్వాత, ఈ పరిమితులు తొలగిపోయాయి. బ్రహ్మోస్-II అభివృద్ధికి మార్గం సుగమమైంది.
రక్షణ రంగంలో భారత్‌కు వ్యూహాత్మక లాభం
బ్రహ్మోస్-II అభివృద్ధి భారత రక్షణ వ్యూహంలో ఒక పెద్ద ముందడుగుగా పరిగణించవచ్చు. ఈ మిస్సైల్ హైపర్‌సోనిక్ వేగం, విస్తృత రేంజ్ దానిని శత్రు రక్షణ వ్యవస్థలకు దాదాపు అసాధ్యమైన లక్ష్యంగా మారుస్తుంది. తద్వారా భారత్, చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల నుండి ఉత్పన్నమయ్యే బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కొనగలదు. ఈ మిస్సైల్ 1,500 కి.మీ. రేంజ్ ద్వారా భారత్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రభావాన్ని గణనీయంగా పెంచగలదు. ముఖ్యంగా చైనా నౌకాదళ శక్తి విస్తరణను ఎదుర్కోవడంలో ఇది కీలకంగా మారుతుంది. అంతేకాక, ఈ ప్రాజెక్ట్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా, దేశీయంగా తయారు చేసిన విడిభాగాలు, సబ్‌సిస్టమ్‌లపై దృష్టి సారిస్తోంది. ఇది భారత రక్షణ పరిశ్రమకు ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాక, విదేశీ ఆధారితతను తగ్గిస్తుంది.
Read Also: President: కొత్త అధ్యక్షుడి కోసం దక్షిణ కొరియన్లు ఓటు