జమ్ముకశ్మీర్(Jammu Kashmir)లో పహల్గాం(Pahalgam)లో ఉగ్రదాడి జరిగి నెలరోజులైన కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. ఏప్రిల్ 22న పర్యటక ప్రదేశం బైసరన్(Baisaran)లో ముష్కరులు 25మంది పర్యటకులను, ఓ స్థానికుడిని కాల్చిచంపారు. వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. పలువురు అగ్రశ్రేణి ఉగ్రవాదులు హతమైనప్పటికీ పహల్గాం(Pahalgam) ఘటనకు బాధ్యులైనవారు మాత్రం దొరకలేదు.
అదుపులోకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న యువకులు
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ-NIA ఘటనతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధమున్న వేల మంది అనుమానితులను ప్రశ్నించింది. వారిలో ఫుడ్‌స్టాల్ యజమానులు, జిప్‌లైన్ ఆపరేటర్లు, పోనివాలాలు ఉన్నారు. వందల మందిని అదుపులోకి తీసుకోవటంతోపాటు దాదాపు వంద మందికిపైగా అనుమానితులపై ప్రజా భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి వేర్వేరు జైళ్లలో నిర్బంధించారు. గతంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు.

రూ.20 లక్షల రివార్డ్ ప్రకటన
దర్యాప్తు వేగం పుంజుకునేందుకు NIA ముగ్గురు అనుమానితుల ఛాయాచిత్రాలను విడుదల చేసింది. అందులో ఒకరిని అనంతనాగ్‌కు చెందిన ఆదిల్ హుస్సేన్ తోకర్‌గా గుర్తించారు. మిగితా ఇద్దరు పాకిస్థాన్ పౌరులని తెలిపారు. ఆ ఇద్దరి పేర్లు అలీబాయ్ ఆకా తలాభాయ్, హసీం ముసా ఆకా సులేమన్ అని ప్రకటించారు. అనుమానితుల సమాచారం తెలిపినవారికి అధికారులు రూ.20 లక్షల రివార్డ్ ప్రకటించారు. వారి ఛాయాచిత్రాలను అనంతనాగ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో అంటించారు.
కేసులో ఎలాంటి పురోగతిలేదు
ఉగ్రవాదులు బైసరన్‌కు చేరుకున్న మార్గం తెలుసుకోవటానికి దాడి జరిగినరోజు మొబైల్ డేటాను, పర్యటకులు తీసిన దృశ్యాలను అధికారులు విశ్లేషించారు. అయినా ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇప్పటివరకు ఎలాంటి పురోగతిలేదు. ఉగ్రదాడి ఘటనలో ఎంతమంది పాల్గొన్నది కూడా స్పష్టతలేదు. నలుగురు లేదా ఆరుగురు ముష్కరులు పాల్గొన్నట్లు అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.
మతం నిర్ధారించుకునేందుకు కల్మా చదవాలని కోరిన ఉగ్రవాదులు, ఆ తర్వాతనే పర్యటకులను కాల్చి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ముష్కరులను పట్టుకునేందుకు భద్రతాదళాలు అవిశ్రాంతంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముష్కరులు ఇప్పటివరకు భద్రతాదళాల కన్నుగప్పి తప్పించుకున్నప్పటికీ వారు పట్టుబడే రోజు ఎంతోదూరం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. పహల్గాం దాడి కేసులో నెల రోజులు గడిచినా ఇంకా ముఖ్య నిందితులు అరెస్ట్ కాకపోవడం, ఉగ్రవాదులు భద్రతా బలగాలను మోసగించడం, ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది. అయినా భద్రతా బలగాలు ముష్కరులు తప్పించుకోలేరు అన్న ధీమాతో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
Read Also: Imran Khan: భారత్ మళ్ళీ దాడి చేయొచ్చు: ఇమ్రాన్ ఖాన్