అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ (One Big Beautiful Bill Act) దేశ ఆర్థిక విధానాల్లో పెద్ద మార్పులకు దారితీయబోతోంది. ఈ బిల్లు ప్రకారం, ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు లీజుగా ఇచ్చే అనుమతులను సులభతరం చేయనున్నారు. ఇది ముఖ్యంగా ఎనర్జీ, మైనింగ్ రంగాలకు ఊతమిచ్చే అవకాశముంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగాన్ని చురుకుగా తీసుకురావడానికి ఇది ఒక కీలక అడుగు అని ట్రంప్ వర్గం చెబుతోంది.
రుణ పరిమితి పెంపుతో ఆర్థిక భారం
ఈ బిల్లులో అత్యంత దృష్టి ఆకర్షిస్తున్న అంశం అమెరికా (America) రుణ పరిమితిని $4 ట్రిలియన్ల వరకు పెంచడం. అయితే దీని ప్రభావంగా అరవై దశాబ్దాల్లో కనిపించనంతగా రుణ భారం పెరిగే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, ఈ బిల్లుతో వచ్చే పదేళ్లలో $2.4 నుండి $3.3 ట్రిలియన్ల అదనపు రుణభారం ప్రజలపై పడే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక స్థిరత్వంపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపై నిపుణుల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సామాజిక రంగాలపై కోత.. వ్యతిరేకత, మద్దతు
ఈ బిల్లులో మరో కీలక అంశం వైద్యం, విద్య, ఇతర సామాజిక సంక్షేమ రంగాల్లో ఖర్చులను తగ్గించడం. దీని వల్ల తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన కోట్లాది మంది ప్రజలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా ఈ బిల్లుకు వ్యతిరేకత కూడా పెరుగుతోంది. అయితే ట్రంప్ వర్గం మాత్రం దీన్ని దేశ భద్రత, అభివృద్ధికి అవసరమైన నిర్ణయంగా సమర్థించుకుంటోంది. మొత్తం మీద, ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా పాలనా విధానాలు, ఆర్థిక ప్రాధాన్యతలు మళ్లీ కొత్త దిశలో కదలనున్నాయి.
Read Also : One Big Beautiful Bill Act : ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’కు సెనేట్ ఆమోదం