సెర్బియా టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపిస్తూ, 2025 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌లో 38 ఏళ్ల వయస్సులో అరుదైన ఘనతను సాధించారు.ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ 2025 టోర్నీలో సెమీఫైనల్ చేరి ఈ ఘనత సాధించిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. బుధవారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్లో 38 ఏళ్ల వయసున్న నొవాక్ జకోవిచ్ 4-6, 6-3, 6-2, 6-4తో ప్రపంచ మూడో ర్యాంకర్ అయిన అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)ని ఓడించాడు. ఈ విజయంతో జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 100 విజయాలు పూర్తి చేసుకున్నాడు. రఫెల్ నాధల్(Rafael Nadal) తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా జకోవిచ్ నిలిచాడు. అంతేకాకుండా జకోవిచ్‌కు ఇది 51వ గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్. ఇది ఒక కొత్త రికార్డు.
మ్యాచ్‌పై పట్టు
దాదాపు,మూడు గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ ఆరంభంలో ఇబ్బంది పడ్డాడు. తొలి సెట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన జ్వెరెవ్ 6-4తో సొంతం చేసుకున్నాడు. మొదటి సెట్ కోల్పోయిన తర్వాత జకోవిచ్ తన ఆటను మెరుగుపర్చుకున్నాడు. అద్భుతమైన డ్రాప్ షాట్స్, బలమైన డిఫెన్స్‌తో జ్వెరెవ్(Zverev)ను ఇబ్బంది పెట్టాడు. జకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్‌పై పట్టు సాధించాడు. కీలక సమయాల్లో బ్రేక్ పాయింట్లను మార్చుకోవడంలో విజయం సాధించాడు.ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 6 ఏఎస్‌లతో పాటు 42 విన్నర్లు కొట్టాడు. 29 తప్పిదాలు చేసిన జకోవిచ్ 35 డ్రాప్ షాట్స్ ఆడి 121 పాయింట్స్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు జ్వెరెవ్ 4 ఏస్‌లు, 38 విన్నర్స్ కొట్టాడు. 44 అనవసర తప్పిదాలు చేసిన జ్వెరెవ్ 12 డ్రాప్ షాట్స్ మాత్రమే ఆడి 101 పాయింట్స్ సాధించాడు.

గెలవడం గమనార్హం
సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్, జాన్నిక్ సిన్నర్(ఇటలీ)తో జకోవిచ్ తలపడనున్నాడు. బుధవారమే జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో సిన్నర్ 6-1, 7-5, 6-0 అలెగ్జాండర్ బుబ్లిక్(కజకిస్థాన్)ను చిత్తు చేశాడు. సిన్నర్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. జకోవిచ్, సిన్నర్ మధ్య హెడ్-టు-హెడ్ రికార్డు 4-4తో సమంగా ఉంది. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో సిన్నర్ గెలవడం గమనార్హం. ఈ క్రమంలోనే సెమీఫైనల్(Semifinal)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇప్పటికే మూడు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ సాధించిన జకోవిచ్ 25వ గ్రాండ్ స్టామ్ టైటిల్‌పై కన్నేసాడు. మరో సెమీఫైనల్లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్, ఇటలీకి చెందిన లోరెంజో ముసెట్టి తలపడుతారు.
Read Also: Bangalore: సెలబ్రేషన్స్ బుధవారం వద్దన్న పోలీసులు..నిరాకరించిన ఆర్సీబీ..