ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే అత్యున్నత పురస్కారం, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి(Nobel Peace) బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో(maria corina machado) ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు. దేశంలో పెరిగిపోతున్న నియంతృత్వ చీకట్లలో ప్రజాస్వామ్య జ్యోతిని వెలిగిస్తూ, లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలుస్తున్న ఆమె ధైర్యానికి, శాంతియుత పోరాటానికి ఈ బహుమతి ఒక గుర్తింపు అని నోబెల్ కమిటీ అభివర్ణించింది.
పేదరికంలో మెజారిటీ ప్రజలు
వెనిజులాలో నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు శాంతియుత పరివర్తన కోసం, ప్రజల హక్కుల కోసం మరియా కొరినా మచాడో(maria corina machado) చేస్తున్న నిరంతర కృషిని కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఒకప్పుడు లాటిన్ అమెరికాలో సంపన్నమైన, ప్రజాస్వామ్య దేశంగా ఉన్న వెనిజులా, నేడు క్రూరమైన, అధికార దాహంతో నిండిన ప్రభుత్వ పాలనలో తీవ్రమైన మానవతా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలోని ఉన్నత వర్గాలు సంపదను పోగేసుకుంటుంటే, మెజారిటీ ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు.
Gaza: 20 సూత్రాల గాజా శాంతి ఒప్పందం

తుపాకీ తూటాల కన్నా బ్యాలెట్ ఓట్లే ముఖ్యం”
గత 20 ఏళ్లుగా మచాడో ప్రజాస్వామ్య ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఆమె స్థాపించిన ‘సుమేట్’ అనే సంస్థ ద్వారా “తుపాకీ తూటాల కన్నా బ్యాలెట్ ఓట్లే ముఖ్యం” అనే నినాదంతో ఆమె ప్రజలను చైతన్యపరిచారు. న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం, మానవ హక్కులు, ప్రజా ప్రాతినిధ్యం కోసం ఆమె గొంతుకను బలంగా వినిపించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని అధికార ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎడ్ముండో గొంజాలెజ్ ఉర్రుటియాకు మద్దతు ప్రకటించి, ఆయన గెలుపు కోసం పనిచేశారు. ఆ ఎన్నికల్లో ప్రభుత్వ రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు ఆమె నాయకత్వంలో లక్షలాది మంది వాలంటీర్లు పోలింగ్ కేంద్రాల వద్ద కాపలా కాశారు. వేధింపులు, అరెస్టులు, చిత్రహింసలు తప్పవని తెలిసినా వారు ధైర్యంగా నిలబడ్డారు. ప్రతిపక్షాలు స్పష్టమైన మెజారిటీతో గెలిచాయని ఆధారాలతో సహా నిరూపించినా, అధికార ప్రభుత్వం ఫలితాలను అంగీకరించకుండా అధికారాన్ని అంటిపెట్టుకుని కూర్చుంది. ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ, దేశం విడిచి వెళ్లకుండా రహస్యంగా ఉంటూనే తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారని నోబెల్ కమిటీ పేర్కొంది.
భవిష్యత్తుకు ఆమె ఒక ఆశాదీపం
అధికార శక్తులు విజృంభిస్తున్న తరుణంలో, మరియా కొరినా మచాడో వంటి స్వేచ్ఛా సంరక్షకులను గుర్తించడం చాలా కీలకమని కమిటీ అభిప్రాయపడింది. ఆమె శాంతి, ప్రజాస్వామ్యం అనే రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని నిరూపించారని, పౌరుల హక్కులకు రక్షణ లభించే భవిష్యత్తుకు ఆమె ఒక ఆశాదీపం అని నోబెల్ కమిటీ తన ప్రకటనలో ముగించింది. కాగా, నోబెల్ కమిటీ ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. తాను అనేక యుద్ధాలు ఆపి, ప్రపంచ శాంతి నెలకొల్పానని, నోబెల్ శాంతి పురస్కారం తనకే ఇవ్వాలని ఆయన గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పలు దేశాలు కూడా ట్రంప్ కు ఈ దిశగా మద్దతు పలికాయి. కానీ, నోబెల్ కమిటీ ఆలోచనలు మరోలా ఉన్నాయని తాజా ప్రకటనతో స్పష్టమైంది.
మరియా కొరినా మచాడోకు ఏమైంది?
30 జూన్ 2023న, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు ఆమె నాయకత్వం వహించిన కారణంగా ప్రభుత్వం ఆమెను 15 సంవత్సరాలు పదవిలో ఉండటానికి అనర్హురాలిగా ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: