అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆమె తన సొంత రాష్ట్రం కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయాలని పరిశీలిస్తున్నారని, ఈ వేసవికి చివర్లో తుది నిర్ణయం ప్రకటించనున్నారని తెలుస్తోంది.కమలా హారిస్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి,ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె బయట ఎక్కువగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్‌గా గావిన్ న్యూసమ్ ఉన్నారు, అయితే కమలా హారిస్ గవర్నర్ పదవికి పోటీ చేస్తే, డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఆమె విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అధ్యక్ష ఎన్నికలు
కమలా హారిస్ 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా, కాలిఫోర్నియా గవర్నర్ పదవికి దృష్టి సారించాలనే యోచనలో ఉన్నారని సమాచారం. ఈ నిర్ణయం ద్వారా ఆమె రాష్ట్ర స్థాయి పాలనలో అనుభవాన్ని పెంపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది.
పోటీ
కమలాహారిస్ కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కమలా హారిస్ పోటీపై అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీకి సిద్ధమైనట్లు సూచనప్రాయంగా తెలిపారు. మరికొన్ని రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

అధ్యక్ష ఎన్నికలకు దూరంగా
2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కమలా యోచిస్తున్నట్లు డెమోక్రటిక్ పార్టీ వర్గాలు తెలిపాయి. దశాబ్దాలుగా కాలిఫోర్నియా వాసులు డెమోక్రట్లకే మొగ్గు చూపుతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగితే తప్పక విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్ రాష్ట్రాలను సొంతం చేసుకుంటూ ట్రంప్ 312 ఎలక్టోరల్ ఓట్లతో విజయం సాధించగా కమలాహారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు.
కామెంట్స్
ఓటమి తర్వాత స్పందించిన హారిస్ కొన్నిసార్లు సానుకూల ఫలితాలకు సమయం పడుతుందని అంతేకాని గెలవలేమని కాదని కామెంట్ చేశారు. స్వేచ్ఛ, న్యాయం, భవిష్యత్తు కోసం మళ్లీ నిలబడాల్సిన, నిమగ్నం కావాల్సిన సమయం ఇదేనని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.2011లో కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికై, ఈ పదవిని దక్కించుకున్న తొలి అమెరికన్ దక్షిణాసియా మహిళగా గుర్తింపు పొందారు. ఆమె న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేశారు. 2016లో, ఆమె అమెరికా సెనేట్‌కు ఎన్నికై, కాలిఫోర్నియా నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి భారతీయ మూలాలున్న మహిళగా నిలిచారు.