ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో ప్రారంభమైన అభివృద్ధి కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) ఉద్ఘాటించారు. భారత్‌కు హాని తలపెట్టాలని చూసిన వారికి తగిన రీతిలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఫూంచ్ జిల్లాలో పర్యటించిన అమిత్ షా, పాకిస్థాన్ దాడుల్లో దెబ్బతిన్ని ప్రాంతాలను పరిశీలించారు. ఈ దాడుల్లో మరణించినవారి కుటుంబాలను పరామర్శించిన అమిత్ షా వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం బాధిత కుటుంబాల్లోని యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

పునరావాస ప్యాకేజీ
పాక్ దాడుల సమయంలో కశ్మీరీ పౌరులు, అధికారులు చూపిన ధైర్యం, దేశభక్తి దేశానికి మరింత బలాన్నిచ్చాయని అమిత్ షా పేర్కొన్నారు. దెబ్బతిన్న ప్రాంతాలకు కేంద్రం త్వరలోనే పునరావాస ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దాడుల సమయంలో పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రాష్ట్ర అధికార యంత్రాంగం చురుకుగా పనిచేసిందని అమిత్ షా ప్రశంసించారు. “జమ్మూకశ్మీర్ అభివృద్ధి ఆగిపోవడం కానీ, నెమ్మదించడం కానీ జరగదు. 2014లో ఎంత వేగంతో అభివృద్ధి ప్రారంభమైందో, అంతే వేగంతో కొనసాగుతుంది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక బంకర్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 9,500 పైగా బంకర్లు నిర్మించాం. బంకర్లు ఆ మాడు రోజుల్లో పౌరుల ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించాయి. పెద్దసంఖ్యలో మరిన్ని బంకర్లను భారత ప్రభుత్వం నిర్మిస్తుంది. వీటి సాయంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజలను కాపాడగలం అన్నారు అమిత్ షా.
పాక్ కోలుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుంది!
పాక్ దురాక్రమణలను సమర్థవంతంగా అడ్డుకున్న బీఎస్ఎఫ్ను కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రశంసించారు. బీఎస్ఎఫ్ దెబ్బకు జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోని 118కిపైగా శత్రు స్థావరాలు ధ్వంసం అయ్యాయని ఆయన అన్నారు. అంతేకాదు పాక్కు చెందిన నిఘా నెట్వర్క్ను బీఎస్ఎఫ్ కూల్చేసిందని, దానిని మరమ్మత్తు చేయడానికి చాలా (4-5) సంవత్సరాలు పడుతుందని అమిత్ షా పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత అమిత్ షా మొదటిసారిగా జమ్మూకశ్మీర్లో రెండు రోజుల పర్యటన చేపట్టారు. జమ్ముకశ్మీర్ భద్రతా పరిస్థితిని, అమర్నాథ్ యాత్ర సంసిద్ధతను సమీక్షించారు. పాకిస్థాన్ దాడులకు గురైన వారిని పరామర్శించారు.
బీఎస్ఎఫ్ గ్రేట్
ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ను అమిత్షా ప్రశంసించారు. ‘బీఎస్ఎఫ్ భారతదేశపు మొదటి రక్షణ శ్రేణిగా పనిచేస్తుంది. ఎడారులు, పర్వతాలు, అడవులు సహా అత్యంత కఠినమైన భూభాగాల్లో అచంచలమైన అంకిత భావంతో బీఎస్ఎఫ్ పనిచేస్తోంది. భారత సరిహద్దులపై ఏ రకమైన దాడి జరిగినా, అది వ్యవస్థీకృతమైనా, అసంఘటితమైనా, రహస్యమైనా, బహిరంగమైనా సరే- మొదట దానిని ఎదుర్కొనేది బీఎస్ఎఫ్ జవాన్లే. వారి శౌర్యం, త్యాగం ప్రశంసనీయం” అని అమిత్ షా కొనియాడారు.
Read Also: Spelling Bee: స్పెల్లింగ్ బీ విజేతగా భారత సంతతి బాలుడు