పాకిస్థాన్‌లో ఒక హిందూ మహిళ అరుదైన ఘనతను సాధించారు. కశీష్ చౌదరి (Kashish Chowdhary) (25) అనే యువతి, బలూచిస్థాన్ ప్రావిన్స్(Balochistan Province)లో అసిస్టెంట్ కమిషనర్(Assistant Commissioner) గా నియమితులై చరిత్ర సృష్టించారు. ఈ ఉన్నత పదవిని అలంకరించిన తొలి హిందూ మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో, ఒక హిందూ మతానికి చెందిన మహిళ సివిల్ సర్వీసెస్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బలూచిస్థాన్‌లోని చాగై జిల్లాకు కశీష్ చౌదరి
బలూచిస్థాన్‌లోని చాగై జిల్లాకు చెందిన నోష్కి అనే చిన్న పట్టణం కశీష్ చౌదరి స్వస్థలం. ఆమె తండ్రి గిరిధారి లాల్ ఒక మధ్యస్థాయి వ్యాపారి. ఉన్నత లక్ష్యంతో బలూచిస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షలకు సిద్ధమైన కశీష్, మూడేళ్ల పాటు అకుంఠిత దీక్షతో శ్రమించారు. రోజుకు కనీసం ఎనిమిది గంటల పాటు చదువుపైనే దృష్టి కేంద్రీకరించినట్లు ఆమె తెలిపారు. తన ఈ విజయం వెనుక క్రమశిక్షణ, కఠోర శ్రమతో పాటు సమాజానికి సేవ చేయాలన్న ప్రబలమైన ఆకాంక్ష ఉన్నాయని కషిష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవులలో హిందూ మహిళలు
ఇటీవలి సంవత్సరాలలో పాకిస్థాన్‌లో పలువురు హిందూ మహిళలు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవులు చేపడుతూ సాంస్కృతిక, సామాజిక అవరోధాలను ఛేదిస్తున్నారు. ఈ కోవలో కశీష్ చౌదరి విజయం మరింత స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గతంలో కూడా కొందరు హిందూ మహిళలు ఇలాంటి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.
2022లో మనీష్ రూపేట కరాచీ నగరానికి తొలి హిందూ మహిళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా, పుష్పా కుమారి కోహ్లి సింధ్ పోలీస్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సబ్-ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. 2019లో సుమన్ పవన్ బోదాని షాదాద్‌కోట్‌లో తొలి హిందూ మహిళా సివిల్ జడ్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
Read Also: Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతి మహిళ