కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)తో సహా వివిధ పార్టీలు బుధవారం బంద్, నిరసనకు పిలుపునిచ్చాయి.దీంతో జమ్మూ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రత్యక్ష సాక్షి
ఫుడ్‌స్టాల్స్ వద్ద కొందరు, గుర్రాలపై స్వారీ చేస్తూ కొందరు, పచ్చిక బయలుపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరి కొందరు పర్యాటకులు ఉన్న సమయంలో అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్చవద్దని మహిళలు వేడుకుంటున్నా వారు కనికరించలేదు. ఇతను ముస్లిం కాదు.. కాల్చేయండి అని ఓ ఉగ్రవాది అన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భర్తను, ఆప్తులను కోల్పోయిన చాలా మంది మహిళలు సాయం కోసం స్థానికులను అర్థించే దృశ్యాలు వైరల్ అయ్యాయి.ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నందున క్షతగాత్రులను తరలించడానికి సైనిక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. భద్రతా ఏర్పాట్ల మధ్య ఇతర పర్యాటకులను అక్కడి నుంచి అధికారులు తరలించారు.పహల్గామ్ దాడిని ఖండిస్తూ సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు. ఈ ఘటన కలిచివేసిందని, గుండె బరువెక్కిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వారు దీని పై రియాక్ట్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఘటన పై సంతాపం వ్యక్తం చేశారు.
చిరంజీవి ట్వీట్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న దారుణమైన దాడి భయంకరమైనది, హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి జరిగిన నష్టాన్ని ఏదీ పూరించలేదు. వారి కోసం నా సంతాపం, ప్రార్థనలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. “పహల్గాం దాడి బాధితుల గురించి తెలిసి హృదయం ద్రవించిపోయింది. దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. శాంతి, న్యాయం కోసం ప్రార్థిస్తున్నా” అని తారక్ రాసుకొచ్చారు.”పహల్గాంలో జరిగిన పిరికి దాడి హృదయ విదారకం. తమవారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి సమయంలో మనం మరింత బలంగా నిలబడాలి. ఈ దుఃఖ సమయంలో ఐక్యంగా, స్ఫూర్తితో ఉండాలి. ఉగ్రవాదం మనల్ని ఎప్పటికీ విభజించలేదు. జై హింద్” అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
Read Also: Terrorist Attack: ఉగ్రదాడిలో అసలు సూత్రధారి ఆర్మీ చీఫ్?