అగ్రరాజ్యం అమెరికా(America) ఈ ఏడాది తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కుదేలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD)నివేదిక తెలిపింది.దీనికి ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వాణిజ్య విధానంపై తీసుకున్న నిర్ణయాలతో పాటు ఈకయూ దేశాలపై ఆయన విధించిన భారీ సుంకాలేనని నివేదిక తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన యుఎస్ జీడీపీ ఈ ఏడాది 2.8% నుండి 1.6%కి పడిపోతుందని నివేదిక తెలిపింది. ఇక 2026లో 1.5%కి తగ్గుతుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) తన నివేదికలో స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లపై ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

అమెరికాలో ధరలు ఒక్కసారిగా పెరిగాయి
OECD నివేదిక ప్రకారం..డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోని దిగుమతులపై సగటు సుంకం రేటును 2.5% నుండి 15.4%కి పెంచారు. 1938 తర్వాత ఇదే అత్యధికం. ఈ నిర్ణయం ఫలితంగా అమెరికాలో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రజలకు నిత్యావసర వస్తువులు భారమయ్యాయి. దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలపై ఆధారపడిన కంపెనీలకు ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాదాపు ప్రతి దేశం నుండి వచ్చే వస్తువులపై 10% సుంకం విధించారు. ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్ వంటి రంగాలపై ప్రత్యేక సుంకాలను కూడా విధించారు. దీంతో పాటుగా ఉక్కు, అల్యూమినియంపై సుంకాన్ని 50% పెంచుతామని కూడా హెచ్చరికలు కూడా చేశారు. ఈ నిర్ణయాలు పెట్టుబడిదారులు, వ్యాపారుల్లో భయాన్ని రేకెత్తించాయి.
సుంకాల నిర్ణయం చట్టవిరుద్ధం
ఇదిలా ఉంటే గత వారం, న్యూయార్క్ కోర్టు అమెరికా అధ్యక్షుడు ఈయూ దేశాలపై తీసుకున్న సుంకాల నిర్ణయం చట్టవిరుద్ధమంటూ తీర్పును వెలువరించింది. అయితే ఈ సుంకాలను అమలులో ఉంచడానికి అప్పీల్ కోర్టు అనుమతించింది. దీంతో ఈ తీర్పు వ్యాపారుల్లో మరింత ఆందోళనను రేకెత్తించింది. OECD చీఫ్ ఎకనామిస్ట్ అల్వారో పెరీరా మాట్లాడుతూ… వాణిజ్యపరంగా అడ్డంకులు.. అనిశ్చితితో కూడిన ప్రపంచ వాణిజ్యం వంటి అంశాలు పెట్టుబడులను భారీగా దెబ్బతీశాయని అన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యపరమైన యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతోంది.2024లో 3.3%గా ఉన్న ప్రపంచ వృద్ధి 2025లో 2.9%కి మందగిస్తుందని ఇది 2026లో కూడా అలాగే ఉంటుందని OECD అంచనా వేసింది. ఇక ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా 2025లో 4.7%, 2026లో 4.3% వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 5% నుండి తగ్గింది. ట్రంప్ సుంకాలు చైనా ఎగుమతిదారులను భారీగా దెబ్బతీస్తాయని నివేదిక తెలిపింది. అయితే బీజింగ్ వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని తెలిపింది.
Read Also: Iran: ఇరాన్‌లో కిడ్నాప్ అయిన భారతీయుల ఆచూకీ