Camp Century : ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా అత్యంత గోప్యంగా నిర్మించిన ఒక సైనిక స్థావరం దశాబ్దాల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చింది. గ్రీన్‌ల్యాండ్ మంచు పొరల కింద దాగి ఉన్న **Camp Century**ను తాజాగా NASA శాస్త్రవేత్తలు రాడార్ స్కానింగ్‌లో అనూహ్యంగా గుర్తించారు. సాధారణ శాస్త్రీయ పరిశోధనలో భాగంగా ఈ రహస్య బేస్ బయటపడటం విశేషంగా మారింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో, గల్ఫ్‌స్ట్రీమ్ III విమానంలో ఉత్తర గ్రీన్‌ల్యాండ్‌పై ప్రయాణిస్తున్న నాసా శాస్త్రవేత్తలు UAVSAR అనే ఆధునిక రాడార్ వ్యవస్థను పరీక్షించారు. ఈ స్కానింగ్ సమయంలో, పిటుఫిక్ స్పేస్ బేస్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో మంచు కింద సహజంగా లేని, సూటి రేఖల్లో ఉన్న నిర్మాణాల సంకేతాలు రాడార్‌లో నమోదయ్యాయి. చారిత్రక మ్యాపులతో పోల్చి చూసిన తర్వాత అవి క్యాంప్ సెంచురీ అవశేషాలేనని నిర్ధారించారు.
1959లో అమెరికా ఆర్మీ ఇంజినీర్లు ఈ బేస్‌ను నిర్మించారు. ‘మంచు కింద నగరం’గా పేరుగాంచిన ఈ స్థావరం కోసం మంచులో సుమారు 8 మీటర్ల లోతులో సొరంగాలు తవ్వి, వాటిపై మళ్లీ మంచును కప్పేశారు. ఇక్కడ సుమారు 200 మంది సిబ్బంది నివసించేలా ల్యాబ్‌లు, నివాస గదులు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. విద్యుత్ అవసరాల కోసం పోర్టబుల్ న్యూక్లియర్ రియాక్టర్‌ను కూడా వినియోగించారు.
Read Also: Nellore: స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధికి 1.80 కోట్లు మంజూరు: మంత్రి ఆనం
వాస్తవానికి ఇది ‘ప్రాజెక్ట్ ఐస్‌వర్మ్’ అనే రహస్య సైనిక (Camp Century) ప్రణాళికలో భాగం. సోవియట్ యూనియన్ను లక్ష్యంగా చేసుకుని అణు క్షిపణులను మంచు కింద దాచాలన్నది ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న వ్యూహం. అయితే మంచు పొరలు ఊహించిన దానికంటే వేగంగా కదులుతుండటంతో ఇది సురక్షితం కాదని భావించి, 1967 నాటికి ఈ బేస్‌ను పూర్తిగా వదిలేశారు.

కాలక్రమేణా మంచు పేరుకుపోవడంతో ప్రస్తుతం ఈ స్థావరం అవశేషాలు సుమారు 30 మీటర్ల (దాదాపు 100 అడుగులు) లోతులో కూరుకుపోయి ఉన్నాయి. అణు రియాక్టర్‌ను తొలగించినప్పటికీ, రసాయనిక, జీవ, రేడియోధార్మిక వ్యర్థాలు అక్కడే మిగిలిపోయాయి. వాతావరణ మార్పుల కారణంగా మంచు కరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఈ వ్యర్థాలు బయటపడితే పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: