భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా భావించే అమెరికన్లు, ఇక్కడ అందుబాటులో ఉన్న కొన్ని సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. అమెరికాకు చెందిన యువతి క్రిస్టెన్ ఫిషర్, ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తూ ఇక్కడి సదుపాయాలపై తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో, భారతదేశంలో లభించే ముఖ్యమైన సౌకర్యాలు అమెరికాలో కూడా ఉంటే ఎంత బాగుండేదో తెలిపింది.
డిజిటల్ పేమెంట్స్
క్రిస్టెన్ ఫిషర్ అభిప్రాయపడిన మొదటి విషయం భారతదేశంలోని డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ. (యూపీఐ) వంటి సాంకేతికతలు భారత్‌లో నగదు లావాదేవీలను ఎంతో సులభతరం చేశాయి. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఎక్కడైనా చెల్లింపులు చేయొచ్చని, అమెరికాలో ఇలాంటి సౌకర్యం ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంది.
ఆటోలు
భారతదేశంలో అడుగడుగునా కనిపించే ఆటోలు, తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించే ప్రధాన సాధనంగా మారాయని, ఇలాంటి సౌకర్యం అమెరికాలో ఉంటే ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని ఫిషర్ అభిప్రాయపడింది.
అపాయింట్‌మెంట్లు
భారతదేశంలో అనారోగ్యానికి గురైతే ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా డాక్టర్‌ను కలిసే అవకాశం ఉందని, అయితే అమెరికాలో డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం కనీసం వారం ముందుగా బుక్ చేసుకోవాలని చెప్పింది. కొన్ని సందర్భాల్లో నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుందని వివరించింది.
చెత్త తొలగింపు సేవలు
ఢిల్లీలో మున్సిపాలిటీ సిబ్బంది ఉచితంగా చెత్తను సేకరిస్తారని, ఇలాంటి సౌకర్యం అమెరికాలో ఉండడం లేదని ఫిషర్ పేర్కొంది. అక్కడ చెత్తను తొలగించడానికి అధిక ఫీజు చెల్లించాల్సి వస్తుందని తెలిపింది.అందుకే చాలా పనులు ఎవరికి వారే నేర్చుకుని చేసుకుంటారని వివరించారు.
శాకాహార వంటకాలు
భారత్ లోని వివిధ రెస్టారెంట్లలో లభించే శాకాహార వెరైటీలు అమెరికాలో కనిపించవని, ఇండియాలో తనకెంతో నచ్చిన విషయం ఇదేనని ఫిషర్ తెలిపారు. అమెరికన్లు రోజూ అందుకునే జంక్ మెయిల్ ఇబ్బంది భారతీయులకు లేదన్నారు.

మెడికల్ షాపులలో సులభంగా మందుల అందుబాటు
భారతదేశంలో చిన్నచిన్న అనారోగ్యాల కోసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొన్ని మందులను ఫార్మసీల నుంచి కొనుగోలు చేయగలిగే సౌలభ్యం ఉందని,మందులు కొనుగోలు చేసే సదుపాయం అమెరికాలోనూ అందుబాటులోకి వస్తే బాగుంటుందని చెప్పారు.
ధర నియంత్రణ
భారతదేశంలో ఏ వస్తువునైనా కొనుగోలు చేసే ముందు ఎంఆర్పీ చూసి వాటిని కొనుగోలు చేయొచ్చని, దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ వస్తువు ధర అంతే ఉంటుందని,కానీ అమెరికాలో ధర విక్రేతల చేతుల్లోనే ఉంటుందని ఫిషర్ తెలిపింది.
ఆన్‌లైన్ డెలివరీ సౌకర్యం
భారతదేశంలోని డెలివరీ యాప్‌లు అన్నీ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అందుబాటులో ఉండటాన్ని ఫిషర్ ప్రశంసించింది. తినే ఆహారం నుండి అవసరమైన వస్తువుల వరకు భారతదేశంలో డెలివరీ సేవలు అందుబాటులో ఉండడం గొప్ప అని ఫిషర్ తెలిపింది.ఈ పాయింట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతదేశం చాలా రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఈ సదుపాయాలు అమెరికాలో కూడా ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడింది.