ఐరోపా(Europe)లో అత్యంత ఎత్తైన, ప్రపంచంలోని క్రియాశీల అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా(Mount Yetna) సోమవారం ఒక్కసారిగా బద్దలైంది. భారీ విస్ఫోటనం సంభవించడంతో లావా ఎగిసిపడి.. చుట్టూ దుమ్ము కమ్మేసింది. స్థానిక కాలామానం ప్రకారం సోమవారం ఉదయం దాదాపు 11:24 గంటల సమయంలో ఎట్నా ఈశాన్య భాగం బద్దలైనట్టు ఇటలీ జియోఫిజిక్స్ అండ్ వల్కనాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ (INGV) ప్రకటించింది. ఈ విస్ఫోటనం అనంతరం పర్వత శిఖరం నుంచి లావా ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎట్నా బద్దలైన సమయంలో అక్కడ ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు.

ఇటలీ ఇన్స్టిట్యూట్ ప్రకారం..
అత్యంత ప్రమాదకర విస్ఫోటనంగా పరిగణించిన అధికారులు.. టూరిస్ట్‌లు, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్ని పర్వతం నుంచి ప్రమాదకర వాయువులు, ధూళి విడుదల అవుతుండడంతో మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులకు సూచించారు. ఇటలీ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. ‘తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది…. నిరంతర విస్ఫోటనలు జరుగుతున్నాయి.. మధ్యాహ్నం సమయానికి లావా ఫౌంటెన్ దశకు లావా చేరింది’ అని తెలిపింది. మౌంట్ ఎట్నా శిఖరాల నుంచి ఉప్పొంగుతున్న లావా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద సుమారు 6.5 కిలోమీటర్ల ఎత్తుకు (4 మైళ్ళకు పైగా) చేరిందని అధికారులు అంచనా వేశారు. అయితే, సమీపంలోని కటానియా విమానాశ్రయం యథావిధిగా పనిచేస్తున్నదని తెలిపారు. అయితే, విమానయాన అధికారులకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎట్నా చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు తక్షణ ప్రాణహాని లేదని స్పష్టం చేశారు. అయితే, పర్వతానికి చుట్టుపక్కల ఉన్న పర్యాటకులు లావా, బూడిద ఎగజిమ్మడంతో పరుగులు పెడుతోన్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇక, భూకంపాలు, అగ్ని పర్వతాలకు పసిఫిక్ తీరం నిలయమైన దీవుల సమూహం ఇండోనేషియాలోనూ తరుచూ అగ్ని పర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయి. అలాగే, దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వత శ్రేణుల్లోనూ అగ్ని పర్వతాలు ఉన్నాయి. చిలీలోని లాస్కా క్రియాశీలక అగ్ని పర్వతం తరుచూ బద్దలవుతుంటుంది.
ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటిగా గుర్తింపు
ఇక, మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఆఫ్రికా, యూరేషియా టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉంది. దశాబ్దాలుగా విస్ఫోటనాలు జరుగుతూ ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. సిసిలీ ద్వీపంలో ఉండే ఈ పర్వతం.. ఎత్తు 3,300 మీటర్లు. మౌంట్ ఎట్నా విస్ఫోటనాలకు సంబంధించి క్రీస్తు పూర్వం 1500 నుంచే రికార్డులు లభ్యమవుతున్నాయి. ఎక్కువ కాలం నుంచి డాక్యుమెంట్ అయిన అగ్నిపర్వతంగా చరిత్రలో నిలిచింది. అగ్నిపర్వత సుందర దృశ్యాలతో పాటు హైకింగ్, స్కీయింగ్ లాంటి పర్యాటక కార్యకలాపాలకు ప్రఖ్యాతి గాంచింది.
Read Also: Russia: ఉక్రెయిన్ కు రష్యా షరతులు