Central Govt: కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి పథకాల వడ్డీ రేట్లలో ఈసారీ మార్పు చేయలేదు. 2025 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ప్రస్తుత వడ్డీ రేట్లే ఉంటాయని ఆర్థిక శాఖ తెలిపింది. వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు 2024-25 నాలుగో త్రైమాసికానికి (జనవరి- మార్చి) నోటిఫై చేసిన వడ్డీ రేట్లే వచ్చే ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇలా వడ్డీ రేట్లు మార్చకపోవడం ఇది వరుసగా ఐదోసారి.

మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు 7.1% వడ్డీ రేటు
నోటిఫికేషన్ ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద చేసే డిపాజిట్లకు 8.2% వడ్డీ రేటు లభిస్తుంది. మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు 7.1% వడ్డీ రేటు కొనసాగుతుంది. పీపీఎఫ్‌కూ ఇదే వడ్డీ రేటు వర్తిస్తుంది. పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా ఎలాంటి మార్పు లేకుండా 4 శాతమే కొనసాగనుంది. కిసాన్ వికాస్ పత్ర పథకానికి వడ్డీ రేటు 7.5% (115 నెలలకు మెచ్యూరిటీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకానికి 7.7%, నెలవారీ ఆదాయ పథకంపై 7.4% వడ్డీ రేటు లభించనుంది. చివరి సారిగా 2023-24 నాలుగో త్రైమాసికంలో ఈ వడ్డీ రేట్లను సవరించింది. ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంటుంది.