అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు ఈ ప్రక్రియలో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తమ వలసల్ని స్వీకరించేందుకు పలు దేశాలు నిరాకరిస్తున్నాయి. అలాగే వలసదారులు సైతం తమ స్వదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అలాగే అరెస్టు చేసి స్వదేశాలకు పంపుతున్న వలసలకు బేడీలు, సంకెళ్లు వేసి తరలించక తప్పని పరిస్ధితి. దీంతో వారి స్వదేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అధికారుల సాయంతో స్వదేశాలకు..
అమెరికాలో అక్రమ వలసలుగా నిర్దారించిన వారిని ఇప్పటివరకూ భారత్ తో పాటు వారి స్వదేశాలకు పంపేస్తున్న ట్రంప్ తాజాగా ఈ ఇబ్బందులతో రూటు మార్చినట్లు తెలుస్తోంది. అంతా సజావుగా ఉంటేనే వలసదారుల్ని స్వదేశాలకు పంపుతున్నట్లు తెలుస్తోంది. అలా కాకపోతే మాత్రం వారిని తమ పొరుగు దేశాలకు పంపి అక్కడి నుంచి అంతర్జాతీయ అధికారుల సాయంతో స్వదేశాలకు వెళ్లేందుకు వీలుగా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిని హోటళ్లలో బందీలుగా మార్చేస్తున్నారు.

హోటల్లో 300 మంది వలసదారుల్ని బందీలుగా
తాజాగా పనామాలోని ఓ హోటల్లో ఇలాగే భారత్ తో పాటు శ్రీలంక,నేపాల్, ఇరాన్, ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్ కు చెందిన దాదాపు 300 మంది వలసదారుల్ని బందీలుగా మార్చేశారు. దీంతో వారు హోటల్ రూముల నుంచే బయటికి తమను కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. వీరికి కావాల్సిన ఆహారం, ఇతర అవసరాలు హోటల్లోనే లభిస్తున్నా.. బయటికి వెళ్లేందుకు మాత్రం అనుమతించడం లేదు. అలాగే వీరిలో 40 శాతం మందికి పైగా వారి స్వదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
రవాణా దేశంగా పనామా
పలు దేశాలకు నేరుగా వలసదారుల్ని పంపడంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా అమెరికా ఇలా తాము బహిష్కరించిన వారి కోసం పనామాను ఓ రవాణా దేశంగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో దేశం కోస్టారికాను కూడా ఇలాగే వలసదారుల ఆశ్రయ దేశంగా ట్రంప్ వాడుకుంటున్నారు.