పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడికి కారణమని నిర్ధారణ కావడంతో, దేశ భద్రత పరంగా కేబినెట్ కమిటీ చురుకైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా భారత్‌లో నివసిస్తున్న పాకిస్తానీయులను మే 1వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని డెడ్‌లైన్ విధించింది. దీనితో అట్టారీ-వాఘా చెక్‌పోస్ట్‌ను తాత్కాలికంగా మూసివేసింది. అధికారిక డాక్యుమెంట్లు ఉన్న పాకిస్తానీయులు కూడా ఈ గడువులోపు భారత్‌ను విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత పాస్‌పోర్ట్, ఆధార్ కార్డుతో సహా పౌరసత్వం
ఇలాంటి సంక్లిష్ట సమయంలో బెంగళూరులో నివసిస్తున్న ఓ పాకిస్తానీయుడు భారత పాస్‌పోర్ట్, ఆధార్ కార్డుతో సహా పౌరసత్వం కలిగి ఉన్నట్లు పేర్కొంటూ దేశ బహిష్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులందరికీ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డులు ఉండటాన్ని ప్రస్తావిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ వీటిని మంజూరు చేయడం వల్లే తమను భారత పౌరులుగా గుర్తించారని వాదించాడు. ఈ నేపథ్యంలో తనను బలవంతంగా దేశం నుంచి పంపించే చర్యలను నిలిపివేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశాడు.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల అసంతృప్తి
ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, తాత్కాలికంగా అతని దేశ బహిష్కరణపై స్టే మంజూరు చేసింది. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్‌ను పరిశీలించి, అతని కుటుంబ సభ్యుల పత్రాలను ధృవీకరించాలని సూచించింది. కేంద్రం తుది నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. అలాగే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల అసంతృప్తి ఉంటే జమ్మూ కాశ్మీర్ లేదా లడఖ్ హైకోర్టును ఆశ్రయించవచ్చని కూడా ఈ బెంచ్ స్పష్టం చేసింది.
Read Also : Bharat : ఘనంగా కొనసాగుతున్న వేవ్స్ సమ్మిట్