జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారానికి దిగింది భారత్. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్‌పై మిస్సైళ్లతో దాడి చేసింది. తెల్లవారు జామున 2 గంటల సమయంలో తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాద క్యాంపులు ధ్వంసం అయ్యాయి. పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తోన్నాయి.
వీడియోలను భారత ఆర్మీ విడుదల
దీనికి సంబంధించిన వీడియోలను భారత ఆర్మీ విడుదల చేసింది. సవాయ్ నల్లా, సర్జల్, మురిడ్కె, కొట్లి, కొట్లి గుల్‌పూర్, మెహమూనా జోయా, భీంబర్, బహవాల్‌పూర్‌పై సాగించిన వైమానిక దాడులు, ఫైటర్ జెట్స్ నుంచి జార విడిచిన మిస్సైళ్లు, అవి సృష్టించిన విధ్వంసకర పరిస్థితులు ఇందులో రికార్డయ్యాయి.
దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ భూభాగంపై ఉంటూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోన్న ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ వైమానిక దాడులను చేపట్టింది. ఉగ్రవాదాన్ని ఉద్దేశపూరకంగా పెంచి పోషిస్తూ వచ్చిన పాకిస్తాన్ పీచమణచాలనేదే ఈ దాడుల ముఖ్య ఉద్దేశం.
ఉగ్రవాద శిబిరాలే టార్గెట్
తాజా దాడులు కూడా ఉగ్రవాద శిబిరాలను టార్గెట్‌గా చేసుకునే సాగాయి. ఈ మిస్సైళ్ల దాడిలో జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ భూభాగంపై ఉండే ఉగ్రవాద శిబిరాలే తమ లక్ష్యమని పేర్కొన్నాయి. తాజా దాడుల్లో జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం సంభవించింది.
Read Also: Trump : అమెరికా ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులకు కొత్త ఆఫర్ – $1000 ప్రోత్సాహకం