రతౌల్ మామిడి – భారత్ గర్వించదగిన అరుదైన రకం
పాకిస్థాన్‌కు అబద్ధాలు చెప్పడం కొత్తకాదు. అయితే అరుదైన మామిడి జాతి విషయంలోనూ అబద్ధాలు చెప్పడం ప్రపంచం ముందే పాకిస్థాన్ అసలు ముఖాన్ని బయటపెట్టింది. రతౌల్ మామిడి జాతి తమ దేశానిదేనని పెద్దఎత్తున ప్రచారం చేయడం ద్వారా, పాక్ మరోసారి అబద్ధపు కథను నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ అబద్ధాన్ని చీల్చిచెదర్చిన ఘనత నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీకే దక్కుతుంది. ఆమె ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, రతౌల్ మామిడి ఉద్భవం భారతదేశంలోని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగిందని స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి కూడా చాటి చెప్పారు.

ఉత్తర్‌ప్రదేశ్ రతౌల్ గ్రామం నుంచే ఆవిర్భవించిన అరుదైన రకం
రతౌల్ పేరుతో ఒక గ్రామం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో ఉంది. ఈ ఊరిలోనే విశ్వ విఖ్యాత రతౌల్ జాతి మామిడి ఆవిర్భవించింది. ఇప్పటికీ ఈ గ్రామం, పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున రతౌల్ జాతి మామిడి తోటల సాగు జరుగుతుంటుంది. ఈ మామిడిని అమెరికా, బ్రిటన్, దుబాయ్ సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మామిడి పంట బాగా దెబ్బతింది. దీంతో ఈసారి విదేశాలకు రతౌల్ మామిడి ఎగుమతి తగ్గడంతో పాటు ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఫలితంగా మామిడి ప్రియుల జేబుకు చిల్లు పడనుంది.
జియా ఉల్ హక్ పంపిన మామిడి, అప్పట్లో మొదలైన వాగ్వాదం
సైనిక నియంత జనరల్ జియా ఉల్ హక్ (General Zia ul Haq) 1978 నుంచి 1988 వరకు పాకిస్తాన్‌ను పాలించారు. అప్పట్లో ఒకసారి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఆయన మామిడి పండ్లను బహుమతిగా పంపారు. “ఇవి రతౌల్ జాతి మామిడి పండ్లు. కేవలం మా పాకిస్థాన్‌లోనే దొరుకుతాయి” అని ఇందిరతో జియా ఉల్ హక్ చెప్పారు. ఈవిషయం ఎలాగోలా రతౌల్ గ్రామస్థులకు తెలిసింది. దీంతోవారు అప్పటి కేంద్ర మంత్రి ఒకరిని కలిసి, పాక్ వాదన శుద్ధ అబద్ధమని తెలిపారు. రతౌల్ రకం మామిడి పండ్ల జాతికి తొలి బీజాలు పడింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ ఊరు రతౌల్‌లోనే అని వారు వివరించారు. తదుపరిగా ఈ అంశం పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలకు తెలిసింది. దీంతో రతౌల్ మామిడి జాతి ఎవరిది ? అనే దానిపై భారత్, పాక్‌ల మధ్య వాగ్యుద్ధం మొదలైంది.
జీఐ ట్యాగ్‌తో భారత హక్కు అధికారికంగా పటిష్టం
“రతౌల్ మామిడి సృష్టికర్త అఫాక్ ఫరీదీ మనవడిని నేను. మా తాతయ్య రతౌల్ మామిడి జాతిని అందుబాటులోకి తెచ్చే నాటికి అసలు పాకిస్థాన్ అనే దేశమే ఉనికిలో లేదు. 1934 సంవత్సరంలో రతౌల్ మామిడి పాక్‌లోని మీరాపూర్ ఖాస్ ప్రాంతానికి చేరింది. ఆ తర్వాతే పాక్ వైపు ఉన్న భూభాగంలో ఈ రకం మామిడి పండ్ల సాగు మొదలైంది. రతౌల్ మామిడికి 2022లో జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ కూడా వచ్చింది” అని అఫాక్ ఫరీదీ మనవడు జునైద్ ఫరీదీ ఈటీవీ భారత్‌కు చెప్పారు.
ముఖ్యమైన నేతల గుండెల్లో చోటు దక్కించుకున్న రతౌల్
ఈ మామిడిని భారతదేశ మాజీ ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్ లాంటి నాయకులు స్వయంగా రుచి చూశారు. అంతేకాదు, లండన్‌లోనూ ఈ మామిడి అమ్మకాలు జరిగేవి. విదేశాల్లో ఈ మామిడికి ఉన్న క్రేజ్ చెప్పలేనిది. దుబాయ్, బ్రిటన్, అమెరికా వంటి దేశాలకు పెద్దఎత్తున ఎగుమతవుతుండేది. అయితే ఇటీవల వచ్చిన భారీ వర్షాల వల్ల పంట దెబ్బతింది. దాంతో ఈ ఏడాది ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో రతౌల్ మామిడికి డిమాండ్ పెరిగి, ధరలు పెరగడం ఖాయం.
సున్నితమైన స్వభావం – రైతుల శ్రద్ధ అవసరం
రతౌల్ మామిడి చాలా సున్నితమైనది. కీటకాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రమమైన పరిశీలన, జాగ్రత్తలతోనే మంచి దిగుబడి సాధించవచ్చు. పండిన తర్వాత ఈ మామిడి రుచి మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. గులాబీ సువాసన, తీపి రుచి, రసంతో కూడిన ఈ మామిడిని ఒక్కసారైనా తింటే మళ్లీ మరిచిపోలేరు.
Read also: Russia Ukraine War: పుతిన్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం