పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌కు చెందిన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాను భారత్‌లో నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐదు రోజుల క్రితమే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతా ను కూడా చట్టపరమైన అభ్యర్థన మేరకు భారత్‌లో నిరోధించిన విషయం తెలిసిందే. తాజాగా రక్షణ మంత్రి ఖాతాను కూడా నిలిపివేయడం ద్వారా భారత్ తన వైఖరిని మరింత స్పష్టం చేసింది.

16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం
అంతకుముందు సోమవారం, భారత్‌ను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే, మత విద్వేషాలను ప్రేరేపించే కంటెంట్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణలపై 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెళ్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఈ చర్య తీసుకున్నారు. నిషేధానికి గురైన వాటిలో డాన్ న్యూస్, ఏఆర్‌వై న్యూస్, జియో న్యూస్, సమా టీవీ వంటి ప్రముఖ వార్తా సంస్థలతో పాటు, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వంటి వ్యక్తుల ఛానెళ్లు కూడా ఉన్నాయి.
వివాదాస్పదమైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గత వారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇస్లామాబాద్ గతంలో ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చి, మద్దతు ఇచ్చిందని ఆయన అంగీకరించినట్లుగా ఉన్న ఒక వీడియో క్లిప్ వైరల్ అయింది. “మేము సుమారు 3 దశాబ్దాల పాటు అమెరికా కోసం… బ్రిటన్‌తో సహా పశ్చిమ దేశాల కోసం ఈ మురికి పని చేశాం… అది పొరపాటు, దానివల్ల మేము నష్టపోయాం” అని ఆయన అన్నట్లు ఆ వీడియోలో ఉంది. “సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో, ఆ తర్వాత 9/11 అనంతర యుద్ధంలో మేము చేరకుండా ఉంటే, పాకిస్తాన్ చరిత్ర నిష్కళంకమైనదిగా ఉండేది” అని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఇరు అణ్వస్త్ర దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారి
అదే సమయంలో, భారత్ ఏదైనా దాడికి పాల్పడితే అది ఇరు అణ్వస్త్ర దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చని ఆసిఫ్ హెచ్చరించినట్లు డాన్ పత్రిక పేర్కొంది. “ఒకవేళ పూర్తిస్థాయి దాడి లేదా అలాంటిదేదైనా జరిగితే, అప్పుడు స్పష్టంగా పూర్తిస్థాయి యుద్ధం ఉంటుంది” అని ఆసిఫ్ స్కై న్యూస్‌తో చెప్పినట్లు ఆ పత్రిక నివేదించింది. పూర్తిస్థాయి సంఘర్షణ ప్రమాదం గురించి ప్రపంచం ఆందోళన చెందాలని ఆయన సూచించారు. పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఖవాజా ఆసిఫ్ తోసిపుచ్చారు. “ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతిస్పందన ఆశ్చర్యం కలిగించలేదు… ఏదో ఒక సంక్షోభాన్ని సృష్టించేందుకే ఇదంతా పన్నారు,” అని ఆయన ఆరోపించారు. దాడికి పాల్పడినట్లు చెబుతున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అనే సంస్థ విశ్వసనీయతను కూడా ఆయన ప్రశ్నించారు. “ఆ సంస్థ పేరు నేనెప్పుడూ వినలేదు” అని ఆసిఫ్ అన్నట్లు సమాచారం.