కాశ్మీర్ లోని పహల్గాంలో తీవ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ లక్ష్యంగా భారత్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో గగనతలం మూసివేత, ఆ దేశ పౌరుల బహిష్కరణ, సింధు నది ఒప్పందం నిలిపివేత, దిగుమతుల రద్దు వంటివి ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ కూడా తమ గగనతలం మూసివేత, భారత పౌరుల బహిష్కరణ, సిమ్లా ఒప్పందం నిలిపివేత, వంటి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య యుద్ధం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కవ్వింపు వ్యాఖ్యలు కొనసాగిస్తోంది.
మొహమ్మద్ ఖాలిద్ జమాలీ సంచలన వ్యాఖ్యలు
ఇదే క్రమంలో రష్యాలో పాకిస్తాన్ దౌత్యవేత్తగా ఉన్న మొహమ్మద్ ఖాలిద్ జమాలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై అణుయుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. అయితే ఇందుకు రెండు సందర్భాలు చెప్పారు. వీటిలో ఒకరు భారత్ తమపై ప్రత్యక్ష దాడికి దిగడం, రెండవది సింధు నది నీళ్లను ఆపడం, ఈ రెండింటిలో ఏది జరిగినా భారత్ పై అణుప్రయోగం తప్పదంటూ హెచ్చరించారు.

లీకైన పత్రాలు తమకు లభించాయి: మొహమ్మద్
రష్యాకు చెందిన ఆర్టీ బ్రాడ్ కాస్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ భూభాగంపై దాడికి భారత్ సిద్దమవుతోందంటూ తమకు విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ఉందని ఆయన తెలిపారు. పాకిస్తాన్ లోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలపై భారత్ దాడి చేయబోతోందంటూ మరికొన్ని లీకైన పత్రాలు తమకు లభించాయన్నారు. అదే జరిగితే తాము సంప్రదాయ యుద్ధంతో పాటు అణుదాడికి కూడా సిద్దంగా ఉన్నట్లు రాయబారి వెల్లడించారు. పాకిస్తాన్ కు వెళ్లే నీటికి ఏ దేశం ఆపినా, మళ్లించాలని చూసినా అది ప్రత్యక్ష యుద్దం కిందకే వస్తుందన్నారు.
Read Also: Benjamin Netanyahu: తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తాం: నెతన్యాహు