‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు పంచుకున్నారు.”మా అన్నయ్య కల్యాణ్ రామ్ ఇప్పటి వరకు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. కానీ ఈ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తన కెరీర్‌లోనే ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని నా నమ్మకం. అన్నయ్య మనసు పెట్టి, ప్రాణం పెట్టి ఈ చిత్రం చేశారు. క్లైమాక్స్‌లో కల్యాణ్ అన్నయ్య నటన ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది” అన్నారు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన చిత్రమే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్. శ్రీకాంత్, సోహైల్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. అందుకే శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. తారక్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని లాంఛ్ చేశారు.
లోటు తీరినట్లు
“చాలా సార్లు నేను, అన్నయ్య ఇలాంటి వేదికలపై నిల్చున్నప్పుడు నాన్న హరికృష్ణ వచ్చి మాట్లాడేవారు. ఈ రోజు ఈ వేదికపై లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి మాట్లాడుతుంటే మా నాన్న లేరు అనే లోటు తీరినట్లు అనిపించింది. ఆమె గొప్ప సాటిలేనిది. కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు. భారత చిత్ర రంగంలోనే హీరోలతో సరిసమానంగా నిలబడ్డ ఏకైక మహిళ విజయశాంతి. ‘కర్తవ్యం’, ‘ప్రతిఘటన’, ‘మగరాయుడు’ ఇలా ఆమె చేసినన్ని శక్తిమంతమైన పాత్రలు, సినిమాలు భారతదేశంలో మరే నటి చేయలేదు. ‘కర్తవ్యం’లో వైజయంతి పాత్రకు ఓ కొడుకు పుడితే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి ఈ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా పుట్టిందనుకుంటున్నా” అని అన్నారు.”నేను ఈ మూవీ మొత్తం చూశా. విజయశాంతి లేకపోతే ఈ సినిమా లేదు. పృథ్వీ, సోహైల్ ఖాన్, దర్శకుడు ప్రదీప్, నిర్మాతలు అశోక్, సునీల్ అందరూ అద్భుతంగా చేశారు. కచ్చితంగా రాసి పెట్టుకోండి- ఆఖరి 20 నిమిషాలు థియేటర్లలో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఈ చిత్రం చూస్తున్నప్పుడు నేను కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయా. దీనంతటికీ కారణం కల్యాణ్ అన్నయ్య అద్భుత నటనే. తను విజయశాంతిని ఒక తల్లిగా నమ్మేసి తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. ఈ ఏప్రిల్ 18న వస్తున్న ఈ అద్భుతమైన చిత్రాన్ని అందరూ చూడండి, ఆస్వాదించండి. ఈసారి మా అన్నయ్య కాలర్ నేనెగరేస్తున్నా” అని ఎన్‌టీఆర్ అన్నారు.
ప్రదీప్ మాట్లాడుతూ
కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, “నటులుగా మేము చాలా సినిమాల్లో నటిస్తుంటాం. మీరు కూడా చాలా చిత్రాలు చూస్తుంటారు. వాటిలో హిట్లు, ఫ్లాప్‌లు అన్నీ ఉంటాయి. కానీ, థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మీ మనస్సులకు హత్తుకుపోయే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రమే మా అర్జున్ సన్నాఫ్ వైజయంతి” అన్నారు.దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ, “కల్యాణ్ రామ్ లేకపోతే ఇవాళ నేనిక్కడ లేను. విజయశాంతి ఒప్పుకోకుంటే ఈ మూవీ చేయవద్దని ఆయన నాకు ముందే చెప్పారు. నేనీ కథ చెప్పగానే ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్న విజయశాంతికి కృతజ్ఞతలు” అన్నారు.

విజయశాంతి మాట్లాడుతూ, “ఇది పూర్తిగా కమర్షియల్ సినిమా. తల్లి పడే ఆరాటం, కొడుకు చేసే పోరాటాన్ని ఈ చిత్రంలో చూస్తారు. మా ఇద్దరి మధ్య జరిగే యుద్ధం ఏంటన్నది ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. తల్లి కోసం ఓ కొడుకు చేసిన త్యాగాన్ని ఈ చిత్రంలో చూస్తారు. ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా, అందర్నీ షాక్‌కు గురి చేసేలా ఉంటుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ ఇంకో మంచి పాత్ర చేయవచ్చు కదా అని అందరూ నన్ను అడిగేవారు. అలాంటి కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు దర్శకుడు ప్రదీప్ ఈ మూవీ స్క్రిప్ట్ చెప్పారు. ఆ కథ, నా పాత్ర నచ్చడం వల్లనే ఈ సినిమా చేస్తానని ఒప్పుకున్నాను. సెన్సార్ వాళ్లు ఈ చిత్రం చూసి నేను, కల్యాణ్‌రామ్ పోటీ పడి నటించామని మెచ్చుకున్నారు. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. దీన్ని అమ్మలందరికీ అంకితమిస్తున్నాం” అన్నారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ విస్సా, బ్రహ్మ కడలి, పథ్వీ రాజ్, సందీప్ వేద్, నాగ మహేశ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Samantha: గతేడాది15 బ్రాండ్లకు నో చెప్పా:సమంత