భారత్ లో రైల్వేలు వేగంగా మారిపోతున్నాయి. సంస్కరణల కోసం గత కొన్నేళ్లుగా రైల్వేశాఖ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలితాలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే వందే భారత్ ల రూపంలో పెను మార్పు కనిపిస్తుండగా.. ఇప్పుడు హైపర్ లూప్ రూపంలో మరో అతిపెద్ద మార్పు సిద్దమవుతోంది. ఇందుకు సన్నాహకంగా ఏకంగా గంటకు 1100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా రూపొందించిన హైపర్ లూప్ వీడియోను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ విడుదల చేశారు.
మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్
ఐఐటీ మద్రాస్ సాయంతో రైల్వేశాఖ తాజాగా దేశంలోనే మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను అభివృద్ధి చేసింది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ పై హై-స్పీడ్ రైళ్లు గంటకు వెయ్యి కిలోమీటర్లకు పైగా వేగంతో వాక్యూమ్ ట్యూబ్ ద్వారా ప్రయాణించేలా ఏర్పాటు ఉంటుంది. ఐఐటీ మద్రాస్ దీనికి అందించిన సాయంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణప్ ప్రశంసలు కురిపించారు. హైపర్‌లూప్ ట్రాక్‌పై ప్రాథమిక పరీక్షల్లో దాదాపు 350 కి.మీల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే అధిగమించవచ్చని తేలింది. దీని వల్ల ప్రయాణికులు ఢిల్లీ నుండి జైపూర్‌కు అరగటంలోనే చేరుకోవచ్చు.

ఐఐటీ మద్రాస్ కు మిలియన్ డాలర్ల గ్రాంట్
ఈ హైపర్ లూప్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు ఐఐటీ మద్రాస్ కు మిలియన్ డాలర్ల గ్రాంట్ ఇవ్వబోతున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. సాంకేతికతను పూర్తిగా పరీక్షించి, విస్తరణకు సిద్ధమైన తర్వాత భారతీయ రైల్వే మొదటి వాణిజ్య హైపర్‌లూప్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తుందని వైష్ణవ్ తెలిపారు.వాణిజ్య సరకు రవాణాకు అనువైన 4,050 కిలోమీటర్లాన్ని గుర్తించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. IIT మద్రాస్ క్యాంపస్‌లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కు రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు ఇచ్చింది. సూపర్ సానిక్ వేగం సాధించే రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.