స్వార్థం రాజ్యమేలుతూ ఉంటే సమాజానికి కలిగే నష్టం అంచనాలకు అందనంతగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులకు ఏదో ఒకరోజు ముగింపు పలకాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రధానంగా సహజ వనరులను దుర్వినియోగం చేస్తూ అడ్డగోలుగా వ్యవహరించే వారిపై హైడ్రా(Hydra) వంటి సంస్థల ప్రయోగం ఎంతో అవసరం.
ప్రస్తుతం సంచలనాలకు వేదికగా ఉన్న హైడ్రాకు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంది. ప్రతిపక్ష, స్వపక్ష నేతలు కూడా గట్టిగా ఖండించలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ మహానగర శివార్లలో చెరువులు, కుంటలను ఆక్రమించి నీరు నిల్వకు అవకాశం లేకుండా చేసి చిన్నపాటి వర్షానికే వరదలు వచ్చి ముంచెత్తేలా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా కట్టడాలు నిర్మించారు. అధికార పార్టీ అండదండలతో కట్టడాలు కొనసాగాయి. పార్టీ నేతలు కూడా ఎవరికి వారు భవంతులు, ఫాములు నిర్మించారు. పెద్దపెద్ద కన్వెన్షన్ హాలులు నిర్మించుకుని కోట్లలో ఆదాయాన్ని గడిస్తున్నారు.

తమకు అడ్డుతగిలే దమ్ము ఎవ్వరికీ లేదని భావిస్తున్న తరుణంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కు అంకురార్పణ జరిగింది. జిహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయితీల పరిధిలోని రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి విస్తరించేలా చట్టాన్ని రూపకల్పన చేశారు. హైడ్రాకు సివిల్ సర్వీసెస్‌కు చెందిన కార్యదర్శి లేదా అంతకు మించిన హోదా కలిగిన అధికారిని కమిషనర్‌గా నియమించాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐజీ ర్యాంకులో ఉన్న ఐసిఎస్ అధికారి ఎ.వి. రంగనాథ్‌ను హైడ్రాకు కమిషనర్‌గా నియమించారు. పైగా హైడ్రా పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరింపచేశారు. జిహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రాంతాలను విపత్తు నుంచి రక్షణ కల్పించేందుకు వీలుగా హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలో పార్కులు, లేఅవుట్ల ఖాళీస్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరులపై అక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించే అధికారాన్ని కల్పించారు. హైడ్రా వీటిని పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో జిల్లా కలెక్టర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్, పోలీసు కమిషనర్లు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు, మున్సిపాలిటీల కమిషనర్లు, గ్రామపంచాయితీలు, జలమండలి, హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్, మూసీ నది అభివృద్ధి సంస్థ, విపత్తు శాఖ, పట్టణ జీవ వైవిధ్యం, నీటిపారుదల వంటి అనేక శాఖల అధిపతులు హైడ్రాకు అవసరమైన సహకారాన్ని తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.

అంటే పరోక్షంగా హైడ్రా తీసుకునే ప్రతిచర్యకు తగిన సహకారం అందించే బాధ్యత అధికారులపై ఉంటుంది. దీనితో హైడ్రాకు ప్రత్యేక హోదా లభించినట్లు అవుతుంది. భవన నిర్మాణాల అనుమతులు, నిబంధనల ఉల్లంఘన, శిథిల భవనాలు, పౌరుల భద్రతకు సంబంధించిన పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్తులను పరిశీలించే అధికారం కూడా హైడ్రాకు ఉంటుంది.
ఈ క్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ఏ కట్టడాన్ని అయినా కూల్చివేసే పూర్తి అధికారాలు ఉంటాయి. ఈ చర్యకు పైన పేర్కొన్న ప్రభుత్వ శాఖలు పూర్తిగా సహకరించాలి. ఈ సంస్థ హైదరాబాద్ నగరానికి ప్రయోజనం కలిగించే చర్యలు చేపట్టడంతో ప్రజల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తోంది. చెరువులు, కుంటలకు చెందిన భూమిని ఆక్రమణదారుల నుంచి రక్షణ కల్పిస్తోంది.
సహజవనరులను కాపాడటం ద్వారా ప్రకృతిపరంగా వచ్చే విపత్తులను అరికట్టే అవకాశం ఉంటుంది. నగరంలో కాల్వల ఆక్రమణలు, శివారు ప్రాంతాల్లో చెరువులు, కుంటల స్థలాల కబ్జాలో సుమారు వేలాది ఎకరాలు ఉన్నాయి. నగరంలో నాలాలు పూర్తిగా అక్రమణలకు గురయ్యాయి. పాతబస్తీలో తలాబ్కట్టలో పూర్తిగా నివాస ప్రాంతంగా మారిపోయింది. నిజాంపేటలో చెరువులను పూడ్చి బహుళ అంతస్తులు నిర్మాణాలు జరిగాయి.
వీటన్నింటినీ తొలగించి సాధారణ స్థితికి తీసుకురావడంలో హైడ్రా అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ప్రాథమికంగా శివారు ప్రాంతంలోని బఫర్‌జోన్ నిర్మాణాలను తొలగించే పనుల్లో హైడ్రా అధికారులు నిమగ్నమై ఉన్నారు. కబ్జాలకు గురైన ప్రాంతంలో ఇప్పటి వరకు కేవలం రెండు మూడు శాతం మాత్రమే విముక్తి కలిగించారు.

ఈ పనులు మరింత జోరుగా సాగాలని, మూడు దశాబ్దాల ముందు ఉండే పరిస్థితులు పునరావృతం కావాలని ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ప్రజల మద్దతు అధికంగా ఉండటంతో రాజకీయ నాయకులు హైడ్రాను ప్రతిఘటించేందుకు సాహసించడం లేదు.
అయితే ఒక వర్గానికి చెందిన కట్టడాలు మాత్రమే కూలుస్తున్నారని, అన్ని కట్టడాలు కూల్చాలని రాజకీయ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేని సాహసానికి ప్రస్తుతం శ్రీకారం చుట్టారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
అక్రమ కట్టడాలు తప్పనిసరిగా తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, వర్గాలు పూర్తిస్థాయిలో సహకరించాలి. కేవలం ఒక వర్గానికి చెందిన కట్టడాలు మాత్రమే కూలుస్తున్నారన్న ఆరోపణలపై దృష్టి సారించాలి.
అక్రమంగా నిర్మించిన అన్ని కట్టడాలు కూల్చడం ద్వారా హైడ్రా పనితీరు విమర్శలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. హైడ్రా ఏర్పాటుతో సమాజహితం జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది.
Read Also: Prices: ఆకాశాన్నంటుతున్న ధరలు సామాన్యుల జీవనంపై భారీ ప్రభావం