తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే కొందరు లబ్ధిదారులను ఎంపిక చేసారు. ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా తొలి, రెండో దశలో డబ్బులు కూడా జమ చేసారు. తాజాగా ఈ పథకంపై రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. రానున్న మూడున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు నిర్మించి ఇస్తామన్నారు. ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు.నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) మంజూరు ఉత్తర్వుల పంపిణీ సభలో పాల్గొన్న ఆయన కీలక కామెంట్స్ చేశారు. గత పదేళ్లలో గత ప్రభుత్వం 93 వేల ఇళ్లను మొదలుపెట్టి కేవలం 66 వేలు మాత్రమే పూర్తి చేసిందన్నారు. మిగిలినవి మొండిగోడలుగానే మిగిలిపోయాయని మంత్రి పొంగులేటి విమర్శించారు.
నిజం చేసేందుకు
అప్పటి ప్రభుత్వం గృహనిర్మాణ శాఖనే రద్దు చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు విడుదల చేయడంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయమని మంత్రి హామీ ఇచ్చారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల (Double bedroom houses) ను పూర్తి చేసేందుకు కూడా నిధులు కేటాయిస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ లేకుండా కలెక్టర్లు పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. భూభారతి చట్టం ద్వారా నిర్వహించిన సదస్సుల్లో రాష్ట్రంలో 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి వెల్లడించారు.

సామాజిక న్యాయం
ఇక బనకచర్ల అంశం 2016లో మొదలైందని, ఏడేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గత పాలకులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. గోదావరిలో 400 టీఎంసీల గురించి తెలంగాణ పక్షాన కేంద్రం వద్ద గాని, కోర్టులో గాని నోరు విప్పారా అని నిలదీశారు. గతంలో ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన అంశాలపై విచారణలు తుదిదశకు వచ్చాయని, తప్పుచేసిన వారు అసలు, మిత్తీతో శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) హెచ్చరించారు.ఇందిరమ్మ ఇళ్లు ఇవి పేదలకు భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే పునాది. సామాజిక న్యాయం అందించే ఈ పథకం, తెలంగాణ ప్రభుత్వానికి కొత్త బలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. విధివిధాలుగా నిర్ధేశిత నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయడం, ఎలాంటి దురుద్దేశాల లేకుండా అమలు చేయడం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.
Read Also: LIC:ఎల్‌ఐసీ రిక్రూట్‌మెంట్ 2025 .. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు