హైదరాబాద్ నగరంలో మరోసారి చట్టం, శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారే సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ బాలీవుడ్ నటి హైదరాబాద్‌కు వచ్చి, షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆమె బస చేసిన హోటల్‌లోనే దుండగుల అఘాయిత్యానికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఏం జరిగింది?
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి ఈనెల 18న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమె మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్ పరిసరాల్లోని ఓ హోటల్‌లో బస చేశారు. అయితే, ఆమె ఊహించని విధంగా దాడికి గురయ్యారు. ఈ నెల 21వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఆమె హోటల్ గదిలో విశ్రాంతిగా ఉండగా, అనుకోకుండా ఇద్దరు యువతులు గదిలోకి చొరబడి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. మీరు మాతో రాత్రి వ్యభిచారం చేయాలి. అంటూ నటి పై ఒత్తిడి తెచ్చారు. బాలీవుడ్ నటి ఇదేదో వ్యాపారం అని అనుకుని వారిని గదిలో నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. కానీ ఆ యువతులు అక్కడే ఉంటూ ఆమెను బెదిరించినట్టు సమాచారం. ఇంకా ప్రమాదకరమైన ఘటన మరుసటి రోజు ఉదయం చోటుచేసుకుంది. 22వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు అదే హోటల్ గదిలోకి ప్రవేశించారు. వారు బాలీవుడ్ నటిని బలవంతంగా లైంగిక దాడికి గురిచేయాలని ప్రయత్నించారు. అయితే, ఆమె ధైర్యంగా ప్రతిఘటించడంతో ఆ దుండగులు కాళ్లు, చేతులు కట్టేశారు. ఆమెను తీవ్రంగా హింసించి, ఒత్తిడి తెచ్చారు. నటిని అదుపులో ఉంచి, ఆమె వద్ద ఉన్న రూ. 50,000 నగదు, బంగారు ఆభరణాలు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర భయాందోళనకు గురైన నటి వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల దర్యాప్తు – నిందితుల కోసం గాలింపు
సమాచారం అందుకున్న వెంటనే మాసబ్ ట్యాంక్ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు హోటల్ సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి, నిందితుల ఆనవాళ్లను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిందితులు స్థానికంగా ఉండే ముఠా సభ్యులని, వీరు గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డవారై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, బాలీవుడ్ నటిపై హైదరాబాద్ నగరంలో దాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని మరియు పోలీసు వ్యవస్థను నిలదీస్తున్నారు.