హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రం భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు జనజీవనం స్తంభించిపోయింది. ప్రకృతి సృష్టిస్తున్న ఈ బీభత్సానికి ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది గల్లంతయ్యారని అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
విపత్తుపై నివేదిక విడుదల
రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్(State Emergemcu Operation Center) ఈ విపత్తుపై ఒక నివేదికను విడుదల చేసింది. జూన్ 20 నుంచి జూలై 2వ తేదీ వరకు జరిగిన నష్టాన్ని ఈ నివేదికలో పొందుపరిచింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం వంటి వర్ష సంబంధిత ప్రమాదాల కారణంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయని తెలిపింది. ఈ ఘటనల్లో సుమారు 103 మంది గాయపడినట్లు నివేదిక వెల్లడించింది. అత్యధికంగా మండీ జిల్లాలో 10 మంది చనిపోయారని తెలిపింది.

ప్రమాదకర స్థాయిలో బియాస్ నది
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా మండీ జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ముందుజాగ్రత్త చర్యగా మండీ, సిర్మౌర్ జిల్లాల్లో సుమారు 250కి పైగా రహదారులను అధికారులు మూసివేశారు. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా 614 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 130 మంచినీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయని, దీంతో విద్యుత్, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
Read Also: Karnataka: ఆటో ఛార్జీలను పెంచిన కర్ణాటక ప్రభుత్వం?