కొత్త ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఫైనాన్స్, బ్యాంకింగ్, పెన్షన్ వంటి ఇతర చాలా ఆర్థిక సంబంధమైన విషయాలకు ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఆర్థిక సంవత్సరం మొదలైన తొలి రోజు నుంచే ఎన్నో ముఖ్యమైన మార్పులు అమల్లోకి వస్తున్నాయి.కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను శ్లాబులు మారుతున్నాయి. ఈ మార్పుల వల్ల ఒక పరిమితి ఆదాయం ఉన్న వ్యక్తులు తక్కువగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులకు సెక్యూరిటీ పెరుగుతుంది. పింఛను పథకాలలో కూడా మార్పులు వస్తున్నాయి.

కొత్త ఆదాయపు పన్ను శ్లాబుల అమలు
ఈ ఏడాది ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో, కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ కొత్త ఆదాయపు పన్ను శ్లాబులు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఈ శ్లాబుల కింద రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది మాత్రమే కాక, వేతన జీవులు రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

బ్యాంకులలో ఉంచాల్సిన కనీస మొత్తాల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు వచ్చాయి. ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా), పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు వంటి పలు బ్యాంకులు ఈ మార్పు తీసుకురానున్నాయి. ఖాతాలలో కనీస మొత్తాలను ఉంచని ఖాతాదారులు పెనాల్టీలు కట్టాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ పోర్టల్‌పై మల్టి ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) అందుబాటులో ఉంది. ఇది పన్ను చెల్లింపుదారులకు సెక్యూరిటీని పెంచుతుంది. 180 రోజుల్లోపు తీసుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్లతోనే జీఎస్టీలో ఈ-వే బిల్లు జనరేట్ అవుతుంది. టీడీఎస్ కోసం జీఎస్టీఆర్-7ను దాఖలు చేసే వారు, నెలలు ఎగ్గొట్టి ఒకేసారి వాటిని వరుసగా దాఖలు చేసుకోలేరు.