పార్లమెంట్, రాష్ట్రపతి తాజాగా ఆమోదించిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 73 పిటిషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో కేంద్రంతో పాటు ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ చట్టానికి మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ఛీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన త్రిసభ్య బెంచ్ విచారణ జరుపుతోంది.

నిబంధనను వ్యతిరేకిస్తున్నారు
పిటిషనర్ల తరఫున ముందుగా వాదనలు ప్రారంభించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. తాజా చట్టంలోని సెక్షన్ 3(ఆర్) ప్రకారం ముస్లింగా జన్మించిన వ్యక్తి వక్ఫ్ కు దానమివ్వాలంటే ఐదేళ్లు ఇస్లాంను అనుసరించాలనే నిబంధనను వ్యతిరేకిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా పౌరులకు తమకు నచ్చిన మతాన్ని అనుసరించేందుకు, మతపరమైన సంస్థలు స్ధాపించి నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ప్రస్తావించారు.
వక్ఫ్ ఆస్తుల్ని రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించడం చెల్లదు
1995లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ నామినీలుగా ఉన్నవారందరూ ముస్లింలేనని కపిల్ సిబల్ తెలిపారు. హిందూ లేదా సిక్కు దేవాదాయ సంస్థల్లో సభ్యులుగా వారే ఉంటారన్నారు. వక్ఫ్ బోర్డులో ఇతర మతాల సభ్యుల్ని అనుమతించడం ప్రత్యక్ష ఉల్లంఘనగా పేర్కొన్నారు. అలాగే వక్ఫ్ ఆస్తుల్ని రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించడం చెల్లదని తెలిపారు. దీనిపై స్పందించిన సీజే సంజీవ్ ఖన్నా.. ముందుగా వక్ఫ్ ఆస్తులుగా గుర్తించిన వాటిని రక్షిత స్మారక చిహ్నాలుగా గుర్తించలేరన్నారు. అలాగే వాడకం ఆధారంగా వక్ఫ్ గా గుర్తింపు కూడా సరికాదన్నారు. నా స్వంత ఆస్తి అయినప్పుడు నేను దానిని ఉపయోగించాలనుకుంటున్నప్పుడు దాన్ని నమోదు చేయకూడదనుకుంటున్నట్లు సిబల్ తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ చేయడంలో సమస్య ఏమిటని సీజే ప్రశ్నించారు. దీనిపై సిబల్ స్పందిస్తూ.. వాడుతున్న వ్యక్తి ఆధారంగా వక్ఫ్ రద్దు చేశారని,, ఇది నా మతంలో అంతర్భాగమని, ఇది రామ జన్మభూమి తీర్పులోనూ చెప్పారని గుర్తుచేశారు.
వక్ఫ్ ఇస్లాంకు చాలా ముఖ్యమైనది
పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది ధావన్ వాదిస్తూ.. ఈ చట్టం కారణంగా రాజ్యాంగంపై దాడికి ఆధారం ఏమిటంటే, వక్ఫ్ ఇస్లాంకు చాలా ముఖ్యమైనది మరియు అంతర్భాగం. మతం, ముఖ్యంగా దాతృత్వం, ఇస్లాంకు చాలా ముఖ్యమైనది మరియు అంతర్భాగం. గతంలో వక్ఫ్ బోర్డు సీఈవోగా ముస్లింలే ఉండే వారని, కానీ ఇప్పుడు అది లేదన్నారు. మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగింపు సరికాదన్నారు. ఐదు సంవత్సరాలు ఇస్లాం అనుసరించాలి అనే నిబంధనపై వ్యతిరేకత.
ఇది ఆర్టికల్ 26 (మత సంస్థల స్థాపన స్వేచ్ఛ)కు విరుద్ధమని వాదన.
వక్ఫ్ బోర్డుల్లో ఇతర మతాల సభ్యులు ఉండటం రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొన్నారు.
వక్ఫ్ ఆస్తులను రక్షిత స్మారక చిహ్నాలుగా ప్రకటించడం చెల్లదని వాదించారు.