సౌందర్య సంరక్షణ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మనం సాధారణంగా ఎర్ర టమాటాల వల్ల కలిగే ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాల గురించి విన్నాం. అయితే, ప్రస్తుతం తెల్ల టమాటా బ్యూటీ పరిశ్రమలో ఒక సంచలనంగా మారింది. చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో, యవ్వనంగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రత్యేకతలు, ప్రయోజనాలు తెలుసుకుంటే, మీరు దీన్ని అస్సలు వదిలిపెట్టరు.
తెల్ల టమాటా ప్రత్యేకతలు
సాధారణంగా ఎర్రగా ఉండే టమాటాలకు భిన్నంగా, ఈ తెల్ల టమాటాలలో ఫైటోయిన్ (Phytoene) మరియు ఫైటోఫ్లూయిన్ (Phytofluene) అనే ప్రత్యేకమైన రంగులేని కెరోటినాయిడ్లు ఉంటాయి. ఎర్ర టమాటాలలో ఉండే లైకోపీన్ (Lycopene) లా కాకుండా, ఈ సమ్మేళనాలు చర్మాన్ని కాంతివంతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తాయి. అందుకే సౌందర్య ఉత్పత్తుల తయారీలో దీని వాడకం బాగా పెరిగింది. ప్రధానంగా, తెల్ల టమాటా సారం చర్మాన్ని కాంతివంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, మొటిమల తాలూకు గుర్తులు, కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించి చర్మానికి సహజమైన నిగారింపును అందిస్తుంది.
చర్మానికి ప్రయోజనాలు
తెల్ల టమాటా చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇది సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత (యూవీ) కిరణాల నుంచి చర్మానికి ఒక కవచంలా పనిచేసి, చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయవు. చర్మంపై ముడతలు రాకుండా నివారించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా, ఇది సున్నితమైన చర్మతత్వం ఉన్నవారికి కూడా ఎలాంటి అలర్జీ కలిగించకుండా పనిచేయడం దీని ప్రత్యేకత అని నిపుణులు వివరిస్తున్నారు.
Read Also : Hyderabad: దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటూ..ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ మృతి