మనకు తిండి విషయంలో పలు అభిప్రాయాలు, జాగ్రత్తలు, కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చేపలు మరియు పెరుగు కలిపి తినొచ్చా లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరైతే ఇది చాలా ప్రమాదకరమని చెబుతారు, మరికొందరైతే “ఏమీ కాదు, నేను ఎప్పుడూ తింటుంటాను” అని అంటారు. అలాంటప్పుడు నిజానికి వైద్య శాస్త్రం ఏమంటోంది? ఆయుర్వేదం లేదా హోమియోపతి ఏమి సూచిస్తున్నాయి? చూద్దాం.

శాస్త్రీయంగా చేపలు – పెరుగు
పెరుగు ఒక శీతల స్వభావం కలిగిన ఆహారం. ఇది శరీరంలో తాపాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో, చేపలు ప్రోటీన్ రిచ్ మరియు శరీరానికి తాపాన్ని పెంచే ఆహారంగా భావించబడతాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియ సరిగా జరగకపోవడం, పేగుల్లో అసమతుల్యత ఏర్పడటం వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశముంది. ఆయుర్వేదంలో చేపల్ని ఉష్ణతత్వం కలిగిన ఆహారంగా భావిస్తారు. పెరుగు శీతల ఆహారంగా పరిగణించబడుతుంది. ఈ రెండింటిని కలిపి తినడం “విరుధ్ ఆహారంగా” పరిగణించబడుతుంది. అంటే గుణాలు విరుద్ధంగా ఉండే పదార్థాలను కలిపి తినడం వల్ల శరీరానికి హానికర ప్రభావాలు కలుగుతాయనే నమ్మకం ఉంది.
చేపలు, పెరుగు కలిపి తిన్నా శరీరానికి హాని కలుగుతుందనే అంశంపై తక్కువ శాస్త్రీయ ఆధారాలే ఉన్నాయి. కానీ, మీరు ఇవి కలిపి తిన్నప్పుడు గ్యాస్, బ్లోటింగ్, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతున్నాయంటే అప్పుడు తప్పకుండా ఆ కాంబినేషన్ మానేయాలి. లేదంటే సమస్య ఉండదు. అంటే, ఇది పూర్తిగా వ్యక్తిగత శరీర ధర్మంపై ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్కరికీ అనుకూలంగా ఉన్న ఆహారం, ఇంకొకరికి సమస్య కలిగించవచ్చు.

సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు
వైద్యుల అభిప్రాయాలను బట్టి, చేపలు మరియు పెరుగు కలిపి తినడం వల్ల ఈ క్రింది ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని చెబుతున్నారు:
సోరియాసిస్ (Psoriasis): ఇది ఒక రకం క్రానిక్ చర్మ వ్యాధి. కొందరికి చేపలు+పెరుగు కలయిక ఈ వ్యాధిని ఉద్ధీపించవచ్చని అభిప్రాయం ఉంది.
ఎగ్జిమా (Eczema): చర్మం పొడి పోయి, కురుపులు వచ్చే సమస్య.
జీర్ణ సమస్యలు: గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్, కడుపు ఉబ్బరం.
ఆలెర్జీలు: కొందరికి చేపలు లేదా పెరుగు మీదే అలెర్జీ ఉండవచ్చు. కలిపి తింటే అది బలంగా ప్రత్యక్షమవుతుంది.
మితంగా, జాగ్రత్తగా తీసుకుంటే ప్రయోజనమే
అనేక కుటుంబాల్లో, ముఖ్యంగా బెంగాల్, ఒడిషా, తూర్పు భారతదేశంలో చేపల కరివేపలు, కూరల్లో పెరుగు వాడటం అనేది సాధారణమే. ఈ అలవాట్ల ద్వారా వారికే ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదు. ఇది వారి శరీర ధర్మానికి కలిసొచ్చే ఆహారం కావచ్చు. అంతేకాకుండా, వంట విధానంలో తగిన మసాలాలు, ఉప్పు, లవంగం, అల్లం వంటి పదార్థాల వాడక వల్ల కొన్ని సమస్యలు తక్కువగా కనిపించవచ్చు. అందువల్ల, చేపలు+పెరుగు కలయిక ఆరోగ్యానికి శాపమని చెప్పలేం. కానీ మితంగా తీసుకోవడం, మీ శరీర స్పందనను గమనించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

చేపలు తిన్న తర్వాత పెరుగు తినొచ్చా?
చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది — “చేపలు తిన్నాక ఒక గంట గ్యాప్ ఇచ్చి పెరుగు అన్నం తినొచ్చా?” అని. అసలు సమస్య రెండు విరుద్ధ స్వభావాల ఆహార పదార్థాలు ఒకేసారి శరీరంలో ఉండటమే. ఒకటిన్న తర్వాత మరొకటి తినడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది పూర్తిగా వ్యక్తుల అనుభవం మరియు శరీర స్వభావంపై ఆధారపడి ఉంటుంది. చర్మ సమస్యలు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంటే ఈ కాంబినేషన్‌ను పూర్తిగా మానేయడం ఉత్తమం. ఒకసారి తిన్న తర్వాత ఉబ్బసం, అసిడిటీ, వాంతులు లాంటి లక్షణాలు వస్తే తక్షణమే ఆహారం మానేయాలి. శరీరం సహనం చేయకపోతే, మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలి.