రాత్రి పూట చికెన్ (Chiken ) తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చికెన్ తిన్న వెంటనే పడుకుంటే అది సరిగా జీర్ణం కాదు. చికెన్‌లో ఉండే ప్రోటీన్, కొవ్వు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల గుండెలో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ జీర్ణ సమస్యలు రాత్రి పూట నిద్రకు కూడా అంతరాయం కలిగిస్తాయి.
బరువు, ఇతర ఆరోగ్య సమస్యలు
రాత్రి వేళ చికెన్ ఎక్కువగా తినడం వల్ల కేవలం జీర్ణ సమస్యలే కాకుండా మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. నిద్రపోయే ముందు చికెన్ తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, అధిక బరువు వల్ల రక్తపోటు (Blood Pressure), డయాబెటిస్ (Diabetes) వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు రాత్రి పూట చికెన్ తినడం తగ్గించాలని లేదా కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
నిపుణుల సలహాలు
వైద్య నిపుణుల ప్రకారం, రాత్రి పూట చికెన్ తినాలని అనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా, చికెన్ తిన్న తర్వాత కనీసం 2-3 గంటల పాటు నిద్రపోకూడదు. ఈ సమయం జీర్ణం కావడానికి సరిపోతుంది. అలా కాకుండా, వెంటనే పడుకుంటే జీర్ణక్రియ మందగిస్తుంది. అలాగే, రాత్రి భోజనంలో ఎక్కువ మొత్తంలో చికెన్ కాకుండా, మితంగా తీసుకోవడం మంచిది. వీలైనంత వరకు వేయించిన చికెన్‌కు బదులుగా ఉడికించిన చికెన్ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల రాత్రి భోజనం తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.