రక్తదానం చేయడం అనేది ఒక ప్రాణదాయకమైన సాయంగా నిలుస్తుంది. ఇది మనిషి చేసే గొప్ప దానాలలో ఒకటి. అవసర సమయంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు పోతున్న నేపథ్య ప్రతి ఆరోగ్యవంతుడు తాను సురక్షితంగా ఉన్నపుడు రక్తం దానం (Blood Donation) చేయడం మంచిదే. అయితే రక్తదానం చేసిన తర్వాత కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

రక్తదానం తర్వాత విరామం తప్పనిసరి
రక్తదానం చేసిన వెంటనే ఎవరూ వెంటనే తమ పనుల్లోకి తిరిగి వెళ్లకూడదు. కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు అక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకోవాలి. ఇది శరీరంలో తిరిగి రక్తప్రసరణను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఒక్కసారిగా బయటికి వెళ్లడం వల్ల తల తిరగడం, నీరసం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
తగిన ఆహారం తీసుకోవడం
రక్తదానం చేసిన తర్వాత శరీరం కోల్పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేసుకోవడానికి పోషకాహారాలు అవసరం. ముఖ్యంగా ఐరన్ మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు (పాలకూర, మెంతికూర), గోధుమ, బీన్స్, నాటు గుడ్లు, చికెన్, చేపలు వంటి వాటిని తీసుకోవడం మంచిది. అలాగే విటమిన్ C కలిగిన నిమ్మకాయ లేదా నారింజ రసం తాగితే ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది.

హైడ్రేషన్‌కు ప్రాధాన్యం
రక్తదానం చేసిన తర్వాత డీహైడ్రేషన్ జరగకుండా చూసుకోవాలి. అందుకోసం రోజులో కనీసం 2 నుండి 3 లీటర్ల వరకు నీరు తాగాలి. అలాగే కొబ్బరి నీరు, నిమ్మకాయ రసం వంటి ఆరోగ్యపరమైన పానీయాలు తీసుకోవచ్చు.
శరీరాన్ని ఒత్తిడికి గురి చేయకూడదు
రక్తదానం చేసిన రోజున శరీరానికి అధిక ఒత్తిడి వచ్చేలా పని చేయడం, భారమైన వస్తువులు ఎత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయడం మంచిది కాదు. శరీరానికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వడం అవసరం. చాలా కంపెనీలు కూడా ఉద్యోగులకు బ్లడ్ డొనేషన్ లీవ్ ఇస్తుండటం అందుకే.

స్ట్రిప్ బ్యాండేజ్‌ని జాగ్రత్తగా ఉంచడం
రక్తాన్ని తీసిన తర్వాత పెట్టిన బ్యాండేజ్‌ను కొన్ని గంటల వరకు తొలగించకూడదు. అక్కడ తడిమి, ముట్టుకోవడం, మునిగించడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. క్లీన్ & డ్రై గా ఉంచడం మంచిది.
తల తిరుగుడు, నీరసం అయితే ఏం చేయాలి?
కొంతమందికి రక్తదానం చేసిన తర్వాత తల తిరగడం లేదా నీరసం కలగవచ్చు. అటువంటి సమయంలో వెంటనే పడుకుని కాళ్ళను పైకి చాపడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. నీరు తాగి ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. లక్షణాలు అధికంగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
మల్టీ విటమిన్ మరియు ఐరన్ సప్లిమెంట్స్
అవసరమైతే కొన్ని రోజులు మల్టీవిటమిన్లు లేదా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇది రక్త హీమోగ్లోబిన్ స్థాయిని త్వరగా పునరుద్ధరించేందుకు సహాయపడుతుంది. అయితే ఇవన్నీ డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి.

మానసికంగా ఉల్లాసంగా ఉండటం కూడా ముఖ్యం
రక్తదానం చేసిన తర్వాత మానసికంగా టెన్షన్ లేకుండా హాయిగా ఉండటం ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. మంచి సంగీతం వినడం, ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం.
ముందస్తు తగిన జాగ్రత్తలు
రక్తదానం చేయడానికి ముందు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు:
- ముందురోజు మంచి నిద్రపోవడం
- ఆల్కహాల్ తీసుకోకూడదు
- శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవడం
రక్తదానం చేయడం ద్వారా మనం మన సమాజానికి గొప్ప సేవ చేయగలం. అయితే, దానికితోడు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. క్రమశిక్షణతో, సరైన జాగ్రత్తలు తీసుకుంటే రక్తదానం మన ఆరోగ్యాన్ని ఏమాత్రం ప్రభావితం చేయదు.
Read also: Spine problem: కంప్యూటర్ల ముందు పని చేసేవారిలో వెన్నెముక సమస్యలు..జాగ్రత్త!