ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయ్యింది. కోళ్ల ఫారం సమీపంలో ఉన్న ఈ వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపగా అతడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నారు.

ప్రజలకు సురక్షితమైన సూచనలు:
వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు బర్డ్ ఫ్లూ గురించి ప్రజలకు స్పష్టం చేస్తూ, ఉడికించిన గుడ్లు మరియు కోడి మాంసం తినడం సురక్షితమని ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోయాయని అక్కడ శాంపిల్స్ తీసి భోపాల్ పంపగా బర్డ్‌ఫ్లూ అని తేలిందన్నారు. అక్కడ మిగిలిన కోళ్లు, గుడ్లను పూడ్చివేశామని దీనిపై ఆందోళన వద్దన్నారు.
ప్రభావిత ప్రాంతాలు:
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ కాగా, ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 50 లక్షల పైచిలుకు కోళ్లు ఈ వైరస్ తో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. వేల్పూరు ప్రాంతంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకడంతో ఒక కిలోమీటరు పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించి చర్యలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో కోళ్ల తరలింపు, ఉత్పత్తి రవాణా పరిమితులు ఉన్నాయన్నారు.
బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణ:
ఆ ప్రాంతంలో స్పెషల్ టీమ్‌లు ఏర్పాటవగా, సర్వెలెన్స్ కార్యాచరణ కొనసాగుతున్నది. బర్డ్ ఫ్లూ నియంత్రణకు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశామని వలస పక్షులు సంచరించే చెరువులు, కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలకుండా ర్యాపిడ్ టీంలు రంగంలోకి దిగాయన్నారు. పశుసంవర్ధకశాఖ అధికారులు 9966779943 నంబరుతో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనిపై ఆందోళన వద్దన్నారు.