బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందగా.. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ దారుణ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారం రేపుతోంది.

ఘటనపై కేసు నమోదు
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అరా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ 3,4 మధ్య ఉన్న ఓవర్ బ్రిడ్జిపై ఒక వ్యక్తి.. ఒక యువతిపై, ఆమె తండ్రిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. కాల్పులు శబ్దం విన్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు ముగ్గురు మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనలో మరణించిన యువతి ఢిల్లీ వెళ్లేందుకు రైలు ఎక్కడానికి తన తండ్రితో కలిసి స్టేషన్‌కు వచ్చినట్టు చెబుతున్నారు.
అడిషనల్ ఎస్పీ పరిచయ్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ..
అడిషనల్ ఎస్పీ పరిచయ్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ స్టేషన్‌లోని 3, 4 ప్లాట్ ఫామ్‌ల మధ్య ఉన్న ఓవర్ బ్రిడ్జిపై.. ముగ్గురు వ్యక్తులు తుపాకీ గాయాలతో మరణించారని తెలిపారు. మొదట యువతిని, ఆ తర్వాత ఆమె తండ్రిని కాల్చి తర్వాత తనను తాను కాల్చుకున్నట్టు వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి వయస్సు 23-24 సంవత్సరాల మధ్య ఉంటుందని.. అమ్మాయి వయస్సు 16-17 సంవత్సరాల మధ్య ఉంటుందని వివరించారు.
మరోవైపు ఆర్‌పీఎఫ్ సీనియర్ కమాండెంట్ ప్రకాష్ పాండా మాత్రం ఈ సంఘటన ప్లాట్‌ఫామ్ నెంబర్ 2లో జరిగిందని తెలిపారు. నిందితుడు టార్గెట్ చేసి మరీ కాల్పులు జరపడం.. ఆ తర్వాత తనకు తాను కాల్చుకోవడం చూస్తుంటే ప్రేమ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి అమన్ కుమార్ గా తెలిపారు. యువతి పేరు జియా కుమారి, ఆమె తండ్రి పేరు అనిల్ సిన్హాగా చెప్పారు.