అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో మరోసారి విషాదం చోటు చేసుకుంది కైలాసపట్నంలోని ఓ బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు ఊహించని విధంగా ఎనిమిది కుటుంబాల్లో కన్నీరును నింపింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో కర్మాగారంలో మొత్తం 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

ఒక్కసారిగా సంచుల్లోని కెమికల్స్ మంటలు ఎగసిపడటంతో భారీగా పేలుడు సంభవించింది.ఈ మంటలు చుట్టుపక్కల వారిని వెంటనే ఆవరించగా, పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను అప్పికొండ తాతబాబు (50), సంగరాతి గోవింద్ (40), దేవర నిర్మల (38), పురం పాప (40), గుప్పిన వేణుబాబు (34), హేమంత్ (20), దాడి రామలక్ష్మి (35), సేనాపతి బాబూరావు (55)లుగా గుర్తించారు. వీరిలో కొందరు స్థానికులు కాగా, మరికొందరు ఇతర ప్రాంతాల నుంచి పనిచేయడానికి వచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.హోం మంత్రి తానేటి అనిత ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన కార్మికులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.ఈ ఘటనపై మాట్లాడుతూ ఆమె, “విషయం తెలిసిన వెంటనే అధికారులు స్పందించారు. సహాయక చర్యలు వేగంగా చేపట్టారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం,” అని తెలిపారు.అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ఆరా తీశారని మంత్రి అనిత వెల్లడించారు. బాధ్యత వహించాల్సిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు ఈ ఘటనతో మళ్లీ ఒకసారి బాణసంచా తయారీ కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. సరైన అనుమతులు లేకుండా పని చేస్తున్న కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
Read Also : Anakapalli Firecracker : బాణసంచా కర్మాగారంలో పేలుడు… నలుగురి మృతి