Israel-Hamas : ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వరుసదాడులతో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్‌పై టెల్‌అవీవ్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 32 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు, మహిళలే ఉన్నారని తెలిపారు. ప్రతిగా ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ రాకెట్లతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ వరుస దాడుల వల్ల గాజాలో ఆహార, ఔషధ నిల్వలు తగ్గుతున్నాయని.. రోజురోజుకు పరిస్థితులు నిరాశాజనకంగా మారుతున్నాయని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది.

గాజాలోనే 55 మంది పాలస్తీనియులు
ఈ వారంలో గాజా, సిరియాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 64 మంది మృతి చెందారు. గాజాలోనే 55 మంది పాలస్తీనియులు మరణించారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. తాజా వైమానిక దాడుల్లో మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందితోపాటు ఐదుగురు పసి పిల్లలు, నలుగురు మహిళలు కూడా ఉన్నారని తెలిపాయి. హమాస్‌తో 17 నెలలుగా కొనసాగుతున్న పోరులో ఈ ఏడాది జనవరి నుంచి కాల్పుల విరమణ అమల్లో ఉన్నా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఒప్పందంలో మార్పులు చేయడానికి హమాస్ తిరస్కరించడంతో దాడులకు పాల్పడాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ సైన్యాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ట్రంప్‌ను కలవనున్న నేపథ్యంలో గాజాపై వరుస దాడులు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్న నేపథ్యంలో గాజాపై టెల్ అవీవ్ వరుస దాడులకు పాల్పడుతుండడం గమనార్హం. ట్రంప్‌తో భేటీలో భాగంగా నెతన్యాహు హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం, బందీల విడుదల, ఇరాన్ అణుసంక్షోభం, తమ దేశంపై విధించిన 17శాతం టారిఫ్‌లపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి నెతన్యాహు వాషింగ్టన్ పర్యటనకు వెళ్లడం ఇది నాలుగోసారి.
Read Also : ఘోర రోడ్డు ప్రమాదం.. హంద్రీనీవా డిప్యూటీ కలెక్టర్ మృతి