టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది అంటే అరచేతిలో ఉండే ఫోన్ ద్వారా ఏదైన చిటికెలో చేసేయొచ్చు. అయితే అదే టెక్నాలజీతో పాటు సైబర్ మోసాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులలో పుట్టుకోస్తున్నాయి. సైబర్ నేరాల గురించి మనం తరచుగా వార్తల్లో వింటుంటాం… కానీ ఊహించని విధంగా టెక్నాలజీని ఉపయోగించి జనాల్ని మోసం చేస్తున్న ఓ బడా స్కాంని పోలీసులు ఛేదించారు. విషయం ఏంటంటే హైదరాబాద్లోని హై-టెక్ సిటీలో ఒక ఆఫీసు నుండి పనిచేస్తూ అమెరికాలోని అంతర్జాతీయ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ పేపాల్ కస్టమర్లను మోసం చేస్తున్న నకిలీ కాల్ సెంటర్‌ను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు.

మేనేజింగ్ డైరెక్టర్ చందా మనస్వినితో సహా 63 మంది అరెస్టు
ఎగ్జిటో సొల్యూషన్స్ అనే కంపెనీ పేరుతో నడిపిస్తున్న ఈ ఫేక్ కాల్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ చందా మనస్వినితో సహా 63 మందిని గురువారం అరెస్టు చేశారు. అయితే, ప్రధాన నిందితుడు గుజరాత్ నివాసి కైవన్ పటేల్ రూపేష్ కుమార్ పరారీలో ఉన్నాడు. ఈ ఫేక్ కంపనీ టెలికాలర్లు ప్రవాస భారతీయులు (NRIs), అమెరికన్లను టార్గెట్ చేసుకోని మోసాలు చేస్తున్నారు. ఒక సమాచారం ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సిబ్బంది బుధవారం రాత్రి ఈ నకిలీ కాల్ సెంటర్‌లో సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ చెందిన అరవై మూడు మందిని ఈ ఫేక్ కాల్ సెంటర్ సంస్థలో పనిచేస్తున్నారని, NRIలు, US పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని కనుగొంది.
పేపాల్ కస్టమర్‌లను టార్గెట్ చేస్తూ
అయితే నిందితులు ఎగ్జిటో సొల్యూషన్స్‌ను ప్రారంభించడం ద్వారా పేపాల్ కస్టమర్ కేర్ ప్రతినిధులగా వ్యవహరిస్తున్నారు. EYEBEAM అండ్ X-LITE వంటి లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి ఫేక్ క్లాస్ చేస్తూ, ఫిషింగ్ ఇమెయిల్‌లు పంపుతూ అమెరికాలో ఉన్న పేపాల్ కస్టమర్‌లను టార్గెట్ చేస్తూ దోచుకుంటున్నారు. అయితే ఈ ఫేక్ కాల్ సెంటర్ ద్వారా బాధితులకి కస్టమర్ పేమెంట్ చేసినట్టు ట్రాన్సక్షన్ లింక్ చూపిస్తూ ఒక ఇమెయిల్ పంపుతారు. అదే ఇమెయిల్‌లో పేపాల్ కస్టమర్ కేర్ కాంటాక్ట్ నంబర్ పేర్కొంటూ ఒక నంబర్ పంపిస్తారు. బాధితులు అలంటి ట్రాన్సక్షన్ చేయలేదని తెలుసుకొని ఇమెయిల్‌కు స్పందించి ఇచ్చిన కస్టమర్లు ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తారు.
బాధితుల నుండి డబ్బు స్వాహా
ఈ ఫేక్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లు బాధితులతో మాట్లాడి ఆపై వారిని తప్పుదారి పట్టించడం ద్వారా బాధితుల నుండి డబ్బును స్వాహా చేస్తున్నారు. ఈ విధమైన మోసాలు OTP మోసాలలానే జరుగుతాయని పోలీసులు తెలిపారు. ఈ స్కామ్ ప్రధాన నిందితుడు కైవన్ పటేల్ రూపేష్ కుమార్ దుబాయ్‌లో నివసిస్తున్న అతని అన్నయ్య విక్కీ, సహచరుడు అజాద్‌తో కలిసి ఈ రాకెట్ నిర్వహిస్తున్నారు. వీళ్ళు పేపాల్ కస్టమర్ డేటాను దొంగిలించి ఈ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లకి షేర్ చేస్తుంటారు.